US Elections: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మన భారతదేశం అయితే, అత్యంత పురాతన ప్రజాస్వామ్యం అమెరికా. కానీ ఈ రెండు దేశాల్లో ఎన్నికలు జరిగే తీరు చూస్తే మాత్రం నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. మన దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎన్నికలు జరగాలంటే ఒకటే కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఉంటుంది. వాళ్లు గీసిన గీతే రూల్. ఓటర్ లిస్ట్ దగ్గరి నుంచి పోలింగ్, కౌంటింగ్, రిజల్ట్స్ దాకా అంతా ఒకే పద్ధతిలో నడుస్తుంది. కానీ అగ్రరాజ్యం అమెరికాలో అసలు కేంద్ర స్థాయిలో ఎన్నికల సంఘం అనే మాటే ఉండదు.
అక్కడ మొత్తం 50 రాష్ట్రాలుంటే.. 50 రకాల చట్టాలు, 50 రకాల రూల్స్ నడుస్తాయి. ప్రెసిడెంట్ ఎన్నికలైనా సరే, ఆయా రాష్ట్రాలే తమకు నచ్చినట్లు ఓటింగ్ పెట్టుకుంటాయి. ఈ మొత్తం తలనొప్పిని చూసి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. "మాకు కూడా ఇండియా లాంటి సెంట్రలైజ్డ్ ఎలక్షన్ సిస్టమ్ కావాలి" అంటూ పట్టుబడుతుండటంతో ఇప్పుడు అమెరికాలో పెద్ద రచ్చ మొదలైంది.
రాష్ట్రానికో రూల్.. అమెరికాలో ఎన్నికల గందరగోళం
అమెరికాలో ఓటు వేయాలంటే ఎంత తలనొప్పి ఉంటుందో తెలిస్తే మనవాళ్లు ఆశ్చర్యపోతారు. మన దగ్గర 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఎన్నికల సంఘం ఓటరు కార్డు ఇస్తుంది. ఆధార్ కార్డు చూపిస్తే చాలు రూపాయి ఖర్చు లేకుండా ఓటేయొచ్చు. నియోజకవర్గాల సరిహద్దులను డీలిమిటేషన్ కమిషన్ పక్కాగా నిర్ణయిస్తుంది. కానీ అమెరికాలో నేషనల్ ఐడీ కార్డు అనేదే ఉండదు. ఓటరుగా నమోదు చేసుకోవడం పూర్తిగా వ్యక్తిగత బాధ్యత. ఏ కార్డు చూపించాలి? పోస్టల్ బ్యాలెట్ ఎలా లెక్కించాలి? అనేది ఆయా రాష్ట్రాల అసెంబ్లీలే డిసైడ్ చేస్తాయి. ఇంకా విచిత్రం ఏంటంటే.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీ తమకు ఎక్కువ సీట్లు వచ్చేలా నియోజకవర్గాల సరిహద్దులను తమకు నచ్చినట్లు గీసేసుకుంటుంది. దీనివల్ల రాష్ట్రానికో తీరుగా ఓటింగ్ వ్యవస్థ నడుస్తోంది.
ఇండియా లాంటి సిస్టమ్ కోసం ట్రంప్ పట్టు..
ఈ గందరగోళానికి చెక్ పెట్టేందుకు ట్రంప్ ఒక ఆర్డర్ తీసుకొచ్చి.. దేశమంతటా ఓటర్లను బయోమెట్రిక్ డేటాతో లింక్ చేయాలని, ఓటు వేసే ప్రతి ఒక్కరూ బర్త్ సర్టిఫికెట్ లేదా పాస్‌పోర్ట్ చూపించాలని కండీషన్ పెట్టారు. పైకి ఇది ఇండియా తరహా పక్కా సిస్టమ్ తెస్తున్నట్లు అనిపించినా, దీని వెనుక అసలు పాలిటిక్స్ వేరే ఉన్నాయని అంటున్నారు.
అమెరికాలో పాస్‌పోర్ట్ తీసుకోవాలంటే 160 డాలర్లు (దాదాపు రూ.13 వేలకు పైగా) ఫీజు కట్టాలి. సర్వేల ప్రకారం.. అక్కడ దాదాపు 2.13 కోట్ల మంది అమెరికన్ల దగ్గర తక్షణమే చూపించడానికి పాస్‌పోర్ట్ గానీ, బర్త్ సర్టిఫికెట్ గానీ లేవు. సరైన కాగితాలు లేని వారిలో అత్యధికులు పేదలు, నల్లజాతీయులు, యువతే. ఈ వర్గాలన్నీ డెమోక్రాట్ల వైపు ఉంటాయన్నది ఓపెన్ సీక్రెట్. అందుకే రూల్స్ పేరుతో వీళ్ల ఓట్లను కట్ చేసి, రిపబ్లికన్లకు అడ్వాంటేజ్ చేసుకోవడానికే ట్రంప్ ఈ ప్రతిపాదన తెచ్చారని డెమోక్రాట్లు మండిపడుతున్నారు.
కోర్టుల మొట్టికాయలు.. కాలిఫోర్నియా ఎదురుదాడి
ట్రంప్ తెచ్చిన ఆర్డర్‌ను అక్కడి ఫెడరల్ కోర్టులు కొట్టేశాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఎన్నికల రూల్స్ మార్చే పవర్ ఒక్క రాష్ట్రాలకే తప్ప వైట్ హౌస్‌కు ఉండదని జడ్జీలు తేల్చి చెప్పారు. మరోవైపు టెక్సాస్, ఒహాయో, ఫ్లోరిడా లాంటి రిపబ్లికన్ రాష్ట్రాలు ట్రంప్ ఆలోచనలకు జై కొడుతూ ఓటర్ల లిస్టులను ఫెడరల్ ప్రభుత్వంతో పంచుకుంటుంటే.. డెమోక్రాట్ల కంచుకోట కాలిఫోర్నియా మాత్రం తిరుగుబాటు బావుటా ఎగరేసింది. కోర్టు ఆర్డర్ లేకుండా ఓటర్ల వివరాలు ఎవరికీ ఇచ్చేది లేదని అసెంబ్లీలో చట్టం చేసింది. రిపబ్లికన్ రాష్ట్రాలు సరిహద్దులు మార్చి సీట్లు పెంచుకుంటే, కాలిఫోర్నియా కూడా తమ సరిహద్దులను మార్చి డెమోక్రాట్లకు మరో ఐదు సీట్లు పెరిగేలా ప్లాన్ చేసింది. ఉటా లాంటి రాష్ట్రంలో కొత్తగా ఓటరుగా చేరాలంటే పాస్‌పోర్ట్ అడుగుతుంటే.. కాలిఫోర్నియాలో మాత్రం ఓటర్ కార్డును ఆపడమే నేరం.
మొత్తానికి ప్రపంచానికి ప్రజాస్వామ్య పాఠాలు చెప్పే అమెరికాలో ఒక బలమైన ఎన్నికల సంఘం లేకపోవడం వల్ల ఏ వ్యవస్థ అయినా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇండియా తరహా కేంద్రీకృత వ్యవస్థ కావాలని ఒకవైపు ట్రంప్ లాంటి వాళ్లు వాదిస్తుంటే.. రాష్ట్రాల హక్కులను లాక్కోవడానికే ఈ ఎత్తుగడలని డెమోక్రాట్లు అడ్డుకుంటున్నారు. ఎన్నికల సంస్కరణల పేరుతో సాగుతున్న ఈ పొలిటికల్ గేమ్ చివరకు ఎటు దారితీస్తుందో చూడాలి.


