ఏపీ

AP Cyclones: డబుల్ సైక్లోన్ దెబ్బకు ఏపీ విలవిల.. 'అర్ణబ్' అతలాకులం.. ముంచేసిన 'మురుసు'

6 నిమిషాల పఠనం

AP Cyclones: తీర ప్రాంత ప్రజలు ఒక గండం గడిచిందని ఊపిరి పీల్చుకునే లోపే మరో పెను ముప్పు వచ్చి పడింది. మొన్నటికి మొన్న 'అర్నబ్' తుఫాను సృష్టించిన బీభత్సం నుంచి కోలుకోకముందే.. ఇప్పుడు 'మురుసు' రూపంలో ఇంకో తుఫాను విరుచుకుపడింది. ఇలా ఒకదాని వెంట ఒకటి రోజుల వ్యవధిలోనే రెండు తుఫాన్లు దాడి చేయడంతో కోస్తాంధ్ర అల్లాడిపోతోంది. అటు అన్నదాతల కష్టాలు, ఇటు ప్రభుత్వ ఖజానా పరిస్థితి.. రెండూ అగమ్యగోచరంగా మారాయి.

AP Cyclones: తీర ప్రాంత ప్రజలు ఒక గండం గడిచిందని ఊపిరి పీల్చుకునే లోపే మరో పెను ముప్పు వచ్చి పడింది. మొన్నటికి మొన్న 'అర్నబ్' తుఫాను సృష్టించిన బీభత్సం నుంచి కోలుకోకముందే.. ఇప్పుడు 'మురుసు' రూపంలో ఇంకో తుఫాను విరుచుకుపడింది. ఇలా ఒకదాని వెంట ఒకటి రోజుల వ్యవధిలోనే రెండు తుఫాన్లు దాడి చేయడంతో కోస్తాంధ్ర అల్లాడిపోతోంది. అటు అన్నదాతల కష్టాలు, ఇటు ప్రభుత్వ ఖజానా పరిస్థితి.. రెండూ అగమ్యగోచరంగా మారాయి.

చేతికచ్చిన పంట చేజారింది..

అర్నబ్ తుఫాను కారణంగానే దాదాపు 4,563 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ప్రాథమికంగా లెక్క తేల్చారు. ఆ దెబ్బ నుంచి ఇంకా తేరుకోకముందే మురుసు తుఫాను ఒంగోలు దగ్గర తీరం దాటింది. 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, దంచికొట్టిన వానలతో జనం వణికిపోయారు. గుంటూరు, బాపట్ల, పొన్నూరు ప్రాంతాల్లో కుండపోత వానలు పడ్డాయి.

ఈ జంట తుఫాన్ల దెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 లక్షల హెక్టార్లలో పంటలు నీట మునిగిపోయాయి. ముఖ్యంగా కోతకు వచ్చిన వరి పొలాల్లోనే నీళ్లు నిలిచిపోవడంతో కంకులు మొలకలెత్తుతున్నాయి. ఎల్నీనో వల్ల వర్షాల్లేక అల్లాడి, అప్పులు చేసి పంట పండిస్తే.. సరిగ్గా చేతికొచ్చే టైమ్‌కి తుఫాన్లు నిండా ముంచేశాయని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

కకావికలమైన కోనసీమ..

ఈ రెండు తుఫాన్ల ప్రభావం గోదావరి జిల్లాలపై దారుణంగా పడింది. పచ్చటి అందాలకు పేరుగాంచిన కోనసీమ ఇప్పుడు చెల్లాచెదురైపోయింది. ఒక్క కోనసీమ పరిధిలోనే దాదాపు 46,500 కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. చెట్ల మొవ్వులు విరిగిపోవడంతో మళ్లీ ఆ తోటలు నిలదొక్కుకోవడానికి కొన్నేళ్లు పడుతుందని రైతులు చెబుతున్నారు. దీనికితోడు వేల హెక్టార్లలో అరటి తోటలు నేలమట్టమయ్యాయి. అటు అనకాపల్లి జిల్లాలో జీడిమామిడి తోటలు కూడా తుఫాను గాలులకు కొట్టుకుపోయాయి.

చీకట్లో ఊళ్లు.. కొట్టుకుపోయిన రోడ్లు

తుఫానుల దాటికి గ్రామీణ వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. 15 వేలకు పైగా కరెంట్ స్తంభాలు నేలకూలడంతో ఒంగోలు, చీరాల, బాపట్ల, నెల్లూరు తీర ప్రాంతాల్లో రోజుల తరబడి అంధకారం అలుముకుంది. వందలాది కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయాయి. కల్వర్టులు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. అటు విజయవాడ పరిసరాల్లో బుడమేరు వాగు మళ్లీ ఎక్కడ ఉప్పొంగుతుందోనని జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

టెక్నాలజీతో ప్రాణాలు కాపాడినా.. ఆర్థికంగా గట్టెక్కేదెలా?

శాటిలైట్ సమాచారం, ఆర్టీజీఎస్ వ్యవస్థ సాయంతో అధికారులు ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణనష్టం చాలావరకు తప్పింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సీఎం చంద్రబాబుతో మాట్లాడి సాయం చేస్తామని చెప్పారు. అయితే అసలు సవాలు ఇక్కడే ఉంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం.. వేల కోట్ల రూపాయల నష్టాన్ని ఎలా భరిస్తుంది? రోడ్లు వేయాలన్నా, కరెంట్ తీగలు లాగాలన్నా, రైతులకు పరిహారం ఇవ్వాలన్నా తక్షణమే భారీగా నిధులు కావాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్యాకేజీ రూపంలో తగినంత సాయం అందితే తప్ప, ఈ జంట తుఫాన్ల గాయాల నుంచి ఏపీ కోలుకోవడం అంత తేలిక కాదనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

#AP Cyclones#Andhra Pradesh Weather#Arnab Cyclone#Murusu Cyclone#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి