ఏపీ

AP Municipal Elections: విటమిన్ 'ఎం' దెబ్బకు ఫ్యాన్ గిలగిలా!

7 నిమిషాల పఠనం

మున్సిపల్ ఎన్నికల నగారా మోగినప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక్కటే హుకుం జారీ అయింది. "కూటమికి ఒక్క సీటు కూడా ఏకగ్రీవం కావడానికి వీల్లేదు.. ఎవడైనా ఏకగ్రీవం చేస్తే వచ్చే అసెంబ్లీలో టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదు" అని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గ ఇంచార్జీలకు తేల్చి చెప్పారు.

AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నగారా మోగినప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక్కటే హుకుం జారీ అయింది. "కూటమికి ఒక్క సీటు కూడా ఏకగ్రీవం కావడానికి వీల్లేదు.. ఎవడైనా ఏకగ్రీవం చేస్తే వచ్చే అసెంబ్లీలో టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదు" అని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గ ఇంచార్జీలకు తేల్చి చెప్పారు. కానీ రిజల్ట్స్ వచ్చాక చూస్తే.. ఏకంగా 25 మున్సిపాలిటీలు కూటమి ఖాతాలోకి వెళ్లిపోయాయి. జగన్ అంత సీరియస్ వార్నింగ్ ఇచ్చినా క్షేత్రస్థాయిలో లీడర్లు ఎందుకు సైలెంట్ అయిపోయారు? కార్యకర్తలు కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నా, సేనాపతులే ఎందుకు కాడి పారేశారు? దీని వెనుక ఉన్న అసలు మతలబు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన ‘విటమిన్ ఎం’ (డబ్బు) పంచాయితీనే కారణం అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

అలా ఖర్చు పెట్టలేక చేతులెత్తేసిన నేతలు

ఎన్నికలు అనగానే ప్రచారం నుంచి ఓటర్ల మేనేజ్‌మెంట్ వరకు ప్రతి అడుగుకూ పైసలు కావాల్సిందే. అయితే తాడేపల్లి నుంచి "పోరాడండి" అన్న ఆదేశాలు మాత్రమే వచ్చాయి తప్ప, ఎన్నికల ఖర్చులకు సంబంధించి ఎలాంటి ఫండ్స్ అందలేదని గ్రౌండ్ లెవెల్ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. "అభ్యర్థుల ఖర్చంతా స్థానిక ఇంచార్జీలే భరించాలి" అని అధిష్టానం నిర్మొహమాటంగా చెప్పేయడంతో లీడర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.

నిజానికి ఇంచార్జీలు వేసుకున్న రాజకీయ లెక్కలు చాలా ప్రాక్టికల్‌గా ఉన్నాయనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అధికారంలో కూటమి బలంగా ఉంది, ఇప్పుడు సొంత ఆస్తులు అమ్మి కోట్లు కుమ్మరించినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. ఒకవేళ అప్పులు తెచ్చి మరీ చైర్మన్ పీఠాలు గెలిపించినా.. రేపు కూటమి నేతలు ప్రలోభాలు పెడితే ఆ కౌన్సిలర్లు మన దగ్గరే ఉంటారా? వాళ్లవైపు జంప్ చేయరని నమ్మకం ఏంటి? "ఎవరి కోసమో మన జేబులు ఖాళీ చేసుకోవడం ఎందుకు.. రేపు ఆ క్రెడిట్ ఎవడికో పోతుంది" అనుకుంటూ మెజారిటీ ఇంచార్జీలు సేఫ్ గేమ్‌ ఆడారు. పైసా సపోర్ట్ ఇవ్వని అధిష్టానం కోసం రిస్క్ చేయడం అనవసరం అని భావించి చాలాచోట్ల అసలు పోటీ చేయకుండానే చేతులెత్తేశారని చెబుతున్నారు.

బెజవాడ, గుంటూరులోనూ అదే సైలెన్స్!

చిన్న పట్టణాల పరిస్థితి అటుంచితే, పార్టీకి కంచుకోటలుగా చెప్పుకునే విజయవాడ, గుంటూరు లాంటి కార్పొరేషన్ స్థాయి నగరాల్లోనూ సీనియర్ల విముఖత స్పష్టంగా కనిపించింది. గుంటూరు మేయర్ పీఠం కోసం మాజీ మంత్రి అంబటి రాంబాబు కూతురి పేరును పరిశీలించినా, అనవసరమైన రిస్క్ వద్దని ఆయనే స్వయంగా సున్నితంగా తిరస్కరించినట్లు ప్రచారం జరిగింది. దానికితోడు అంబటి, లేళ్ల అప్పిరెడ్డి వర్గాల మధ్య ఉన్న అంతర్గత పోరుతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరించారు. అప్పిరెడ్డి వర్గం వ్యక్తి బరిలో ఉంటే మిగిలిన వర్గాలు కనీసం ప్రచార మొహం కూడా చూడలేదు. ఇక విజయవాడలో వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు లాంటి సీనియర్ నేతలు పోలింగ్ కంటే ముందే సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోవడం కేడర్‌ను తీవ్రంగా నిరాశపరిచింది.

ప్లానింగ్ లేదు.. రోడ్డుపై పడ్డ లీడర్షిప్!

కూటమి దూకుడును అంచనా వేయడంలో వైసీపీ నాయకత్వం ఘోరంగా విఫలమైంది. కూటమి నేతలు నామినేషన్ల ఘట్టం నుంచే చక్రం తిప్పుతుంటే, వైసీపీ నేతలు మాత్రం కోర్టుల చుట్టూ, ఈసీ ఆఫీసుల చుట్టూ తిరగడానికే సరిపోయింది తప్ప గ్రౌండ్‌లో క్యాడర్‌కు అండగా నిలవలేకపోయారు. సొంత నియోజకవర్గం పులివెందులలోనే వైఎస్ జగన్ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయాల్సి రావడం, ఓటు కూడా వేయకుండా వెనుదిరగడం పార్టీ శ్రేణులను మానసికంగా కుంగదీసింది. విపక్షంలో ఉన్నప్పుడు వ్యూహాత్మకంగా ఎలా పోరాడాలో దిశానిర్దేశం చేసే వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది.

కార్యకర్తలు రెడీ.. లీడర్లే పరార్

ఈ మున్సిపల్ ఫలితాలు తేల్చి చెప్పిన పచ్చి నిజం ఏంటంటే.. వైసీపీలో సమస్య కార్యకర్తల్లో లేదు, పైనున్న నాయకుల్లోనే ఉంది. కేసులు, దాడులు ఉంటాయని తెలిసినా జెండా మోసేందుకు సామాన్య కేడర్ వెనుకాడలేదు. కానీ వాళ్లను నడిపించాల్సిన నేతలే 'విటమిన్ ఎం' ఖర్చు పెట్టలేక, అధికార పార్టీతో ఎందుకొచ్చిన గొడవ అని ఇళ్లకే పరిమితమయ్యారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ పదవులను, కాంట్రాక్టులను అనుభవించిన నాయకులు.. ప్రతిపక్షంలోకి రాగానే సొంత జేబుల్లోంచి పైసా తీయడానికి వెనకాడుతుంటే పార్టీ ఎలా నిలబడుతుంది? 'విటమిన్ ఎం' లేక ఫ్యాన్ రెక్కలు తిరగడం ఆగిపోయిన ఈ దుస్థితిపై జగన్ ఇప్పటికైనా కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ కేడర్ పూర్తిగా డీలా పడిపోవడం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

#AP Municipal Elections#Andhra Pradesh Politics#YSRCP#YS Jagan Mohan Reddy#TDP#NDA Alliance#Municipal Election Results#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి