బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం పాలన తీరు, సీఎం రేవంత్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ పాలనలో అమ్ముకోవడమే తప్పా రాష్ట్రానికి ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదని పరోక్షంగా సెటైర్లు వేశారు. బుధవారం ఉదయం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. హైదర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, మరికొంతమంది నేతలు కారు ఎక్కగా.. వారికి గులాబీ కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘అడవులు నరికే వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది’ అంటూ ఎద్దేవాచేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్రంలో ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములను అమ్ముతున్నారని గుర్తుచేశారు.
మియాపూర్ భూములను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కబ్జా పెడితే ప్రముఖ న్యాయవాదిని పెట్టి కేసు వాదించామని, ఇటీవల సుప్రీంకోర్టు ఆ భూమి ప్రభుత్వానిది అని తీర్పు ఇచ్చిందని వెల్లడించారు. అయితే, తీర్పు వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆ భూములు అమ్మేస్తున్నా అని చెబుతున్నాడని మండిపడ్డారు.
సంవత్సరం లోపల కేసీఆర్ రాబోతున్నాడని, రేవంత్ రెడ్డి వేసే ఎంగిలి మెతుకులకు ఎవరైనా పారిశ్రామికవేత్తలు ఆశపడి హిల్ట్ పీ స్కాంలో భూములు కొంటే తిరిగి అనుభవిస్తారని హెచ్చరించారు. మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని, ఇప్పుడు జరుగుతున్న భూదందాలన్నింటికీ చెక్ పెడతామని వెల్లడించారు.
మియాపూర్‌లో 550 ఎకరాల భూములు ప్రభుత్వానికిగా డిక్లేర్ అయ్యాక అమ్మేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నాడని.. ఆ భూముల్లో 200 ఎకరాల్లో పేదలకు ఇండ్లు, 100 ఎకరాల్లో అమరవీరులకు, ఇంకో 100 ఎకరాలు ఉద్యమకారులకు, మిగతాది పిల్లలకు స్కూల్స్, కాలేజీలు కట్టిస్తే తాము గొప్పగా స్వాగతిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఇదిలాఉండగా, కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు సైతం ఘాటుగానే స్పందిస్తున్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ అమ్మిన భూములతో పోలిస్తే కాంగ్రెస్ హయాంలో చేసినవి చాలా తక్కువ అని కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.


