కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఇటీవలి కాలంలో కామన్ అయిపోయాయి. పదవులు దక్కలేదని కొందరు లాబీయింగ్ చేస్తుండగా.. మరికొందరు నేరుగా పార్టీ పెద్దలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.అది కాస్త అధిష్టానం పెద్దలకు తీవ్ర తలనొప్పిగా మారింది. రెండ్రోజుల కిందట మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలోనే మంత్రి దామోదర.. ఎమ్మెల్యే కాంతారావును దూషించినట్టు తెలిసింది.
తాజాగా ఈ ఎపిసోడ్‌పై టీపీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. నేతల మధ్య ఫైటింగ్ విషయం జనాల్లోకి వెళితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన అధిష్టానం నష్టనివారణ చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రేపు(గురువారం) గాంధీ భవన్ కు రావాల్సిందిగా మంత్రి దామోదర రాజనర్సింహా, ఎమ్మెల్యే లక్ష్మీ కాంత రావ్‍కు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు.
ముందు ఈ సమస్యను పరిష్కరించాక మిగతా నియోజక వర్గాల్లో ఇటీవల పార్టీ లైన్ దాటి మాట్లాడిన వారిపై క్రమశిక్షణ రాహిత్యం కింద చర్యలు తీసుకుంటారని సమాచారం.దామోదర వర్సెస్ లక్ష్మి కాతారావుల మధ్య గొడవ విషయంపై జాతీయ మీడియాలోనూ కథనాలు రావడంతో పార్టీ పరువు బజారున పడేలా చేశారని పీసీసీ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మంత్రి దామోదర రాజనర్సింహా, ఎమ్మెల్యే కాంతారావులను వెంటనే గాంధీభవన్‌కు రావాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతలతో విడివిడిగా, అవసరమైతే కలిపి మాట్లాడి అసలు వివాదానికి కారణమెంటో ఆరా తీయనున్నట్లు సమాచారం.
ఇదిలాఉండగా, ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఈనెల 1వ తేదీన కాంగ్రెస్ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి మంత్రి దామోదర, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతరావు హాజరయ్యారు.అయితే, ఢిల్లీలోని షాంగ్రిలా హోటల్ లాబీలో మంత్రి దామోదర రాజనర్సింహ తనపై వ్యక్తిగత దూషణలకు దిగారని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఏఐసీసీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
నామినేటెడ్ పదవులు, పార్టీ వ్యవహారాలు, నియోజకవర్గ స్థాయి పనులకు సంబంధించి తలెత్తిన విభేదాలే ఈ వాగ్వాదానికి కారణమనే చర్చ జరుగుతోంది. కాగా, ఈ విషయంలో మంత్రి మీద సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే కాంతారావు సిద్ధపడినట్టు సమాచారం. కాగా, ఈ ఇష్యూపై మాట్లాడేందుకు రావాలని టీపీసీసీ నుంచి పిలుపురావడంతో ఏం జరగనుందో వేచిచూడాల్సి ఉంది.


