త్వరలోనే చికెన్ ధరలు భారీగా పెరగనున్నట్టు తెలుస్తోంది. నెల కిందట కిలో చికెన్ రూ.240 నుంచి 260 మధ్యలో ఉండేది. అయితే, అది కాస్త ప్రస్తుతం కేజీ రూ.280 నుంచి 300లకు పైగా పలుకుతోంది. అయితే, మున్ముందు మరింత ధరలు పెరిగే చాన్స్ ఉందని సమాచారం. అందుకు కారణంగా కోళ్లకు వేసే దాణా ధరలు ప్రియం కావడమే అని పౌల్ట్రీవర్గాలు వెల్లడించాయి.ఈ ఏడాది దాణా ధరలు పెరగడంతో కోళ్ల ఉత్పత్తి వ్యయం పెరిగిందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కోళ్ల పెంపకం నుంచి మార్కెటింగ్ వరకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపేందుకు దేశవ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీ సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. చికెన్ ధరల్లో హెచ్చుతగ్గులు, దాణా ధరలు పెరగడంతో పౌల్ట్రీ పరిశ్రమపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే ధరల స్థిరీకరణకు పౌల్ట్రీ సంఘాలు కార్యాచరణ చేపట్టాయి.ఇందులో భాగంగానే లైవ్ చికెన్ కిలోకు కనీసం రూ.110 ధరను ప్రామాణికంగా నిర్ణయించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఆల్ ఇండియా పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ (AIPBA), పాన్ ఇండియా బ్రీడర్స్ అసోసియేషన్ (PIBBC), వివిధ రాష్ట్రాల పౌల్ట్రీ సంఘాల ప్రతినిధులు తాజాగా శంషాబాద్‌లోని నోవాటెల్‌లో సమావేశం నిర్వహించారు. ఇటీవల చికెన్ ధరలు తగ్గడానికి పండుగల సమయంలో వినియోగం తగ్గడమే అని వారు అభిప్రాయపడ్డారు. పౌల్ట్రీ పరిశ్రమకు దాణా ఖర్చులు భారంగా మారుతున్నాయని ఓ నిర్ణయానికి వచ్చారు. మొక్కజొన్న, సోయాబీన్ ధరలు పెరగడంతో కోళ్ల పెంపకం వ్యయం కూడా గణనీయంగా పెరుగుతోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో మొక్కజొన్న, సోయాబీన్ ఉత్పత్తి, మార్కెట్లో లభ్యత, సరఫరాపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫలితంగా వాటి ధరలు మరింత పెరిగితే చికెన్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే నాన్-జీఎంఓ మొక్కజొన్నను ఎటువంటి సుంకాలు లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరాలని పౌల్ట్రీ సంఘాల ప్రతినిధులు ఓ నిర్ణయానికి వచ్చారు.
పౌల్ట్రీ మేత ధరలు ఇప్పటికే 25 శాతం పెరిగి క్వింటాల్‌కు రూ.5,200కు చేరినట్టు తెలిసింది.కోళ్ల పెంపకంలో అధిక వ్యయం 65-70 శాతం దాణాకే పోతుందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే 2027 జనవరి నుంచి బ్రాయిలర్ చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు.


