ఆర్టీసీ బస్సులో చిల్లర పంచాయితీ కాస్త ఓ మహిళ ఉద్యోగి ప్రాణం మీదకు తెచ్చిన విషయం తెలిసిందే.గత వారం కింద చోటుచేసుకున్న ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు మహిళా ఉద్యోగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడి చివరకు కన్నుమూసింది. ఈ ఘటనతో ఆర్టీసీ సంఘాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల బంద్‌కు పిలుపునిచ్చాయి.
వివరాల్లోకివెళితే.. ఆర్టీసీ బస్సు ఎక్కిన ఓ ప్రయాణికురాలితో మహిళ కండక్టర్‌కు చిల్లర వివాదం తలెత్తింది. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే సదరు ప్రయాణికురాలు నెట్టేయడంతో మహిళా కండక్టర్ ప్రవళిక రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో బస్సు వెనుక టైర్లు ఆమె కాళ్ల మీద నుంచి వెళ్లాయి. గత నెల 25న మణుగూరు – భద్రాచలం మార్గంలో అశ్వాపురం మండలం మిట్టగూడెం స్టాప్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 24 ఏళ్ల మహిళా కండక్టర్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ సంజీవని ఆసుపత్రిలో చేర్పించారు. నాటి నుంచి చికిత్స పొందుతూ బాధిత కండక్టర్ ప్రవళిక పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి మృతి చెందింది. ప్రవళిక మృతితో ఆర్టీసీ కార్మిక సంఘాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
అయితే, ప్రవళిక కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని కార్మిక సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల బంద్‌కు యూనియన్లు పిలుపునిచ్చాయి. ప్రవళిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం సైతం కల్పించాలని కోరాయి.


