తెలంగాణ

Telangana Congress: దామోదర రాజనర్సింహ అంతర్మథనం వెనుక అసలు కథేంటి?

6 నిమిషాల పఠనం

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో నివురుగప్పిన నిప్పులాంటి అసంతృప్తి మరోసారి భగ్గుమంది. పార్టీలో అత్యంత సీనియర్ నేత, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రీసెంట్‌గా చేసిన కామెంట్స్ ఇప్పుడు అధికార పార్టీలో గుబులు రేపుతున్నాయి.

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో నివురుగప్పిన నిప్పులాంటి అసంతృప్తి మరోసారి భగ్గుమంది. పార్టీలో అత్యంత సీనియర్ నేత, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రీసెంట్‌గా చేసిన కామెంట్స్ ఇప్పుడు అధికార పార్టీలో గుబులు రేపుతున్నాయి. సాధారణంగా వివాదాలకు దూరంగా, కామ్‌గా తన పని తాను చేసుకుపోయే ఈ సీనియర్ నేత నోటి నుంచి "రాజకీయాల్లో నమ్మకంతో నడిచే రోజులు పోయాయి.. పదవులు ఎవరికీ శాశ్వతం కాదు" అనే మాటలు రావడం వెనుక ఏదో బలమైన కారణమే ఉందన్న చర్చ జోరుగా నడుస్తోంది. మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన వెళ్లగక్కిన ఈ ఆవేదన ఎవరిని ఉద్దేశించి? సొంత పార్టీ నేతల వ్యవహారశైలే ఆయన్ను ఇంతలా బాధించిందా? అసలేం జరిగింది.

"లోపల జరిగేది వేరు.. బయట నడిచేది వేరు!"

గాంధీభవన్‌లో ఎప్పుడూ ఏదో ఒక కుమ్ములాట నడుస్తూనే ఉంటుందన్నది ఓపెన్ సీక్రెట్. అయితే దామోదర చేసిన కామెంట్స్ మాత్రం అంతర్గత విభేదాల లోతును బయటపెట్టాయి. "కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు, కలహాలు కొత్తేమీ కాదు. ఎప్పటినుంచో ఉన్నవే. కానీ పార్టీ లోపల జరిగేది ఒకటి అయితే, బయటకు వచ్చి ప్రచారం జరిగేది ఇంకొకటి" అంటూ ఆయన సూటిగా చెప్పుకొచ్చారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించే విషయాలను కొందరు కావాలనే తప్పుగా మీడియాకు లీకులు ఇస్తున్నారా? తనను టార్గెట్ చేసేందుకు సొంత పార్టీలోనే కొందరు బ్యాక్‌గ్రౌండ్ పాలిటిక్స్ నడుపుతున్నారా? అన్న అనుమానాలకు మంత్రి కామెంట్స్‌కి బలం చేకూరుస్తున్నాయి.

50 ఏళ్ల నిబద్ధత.. మరి విశ్వసనీయతకు విలువేది?

దామోదర రాజనర్సింహ కుటుంబానికి కాంగ్రెస్‌తో దశాబ్దాల అనుబంధం ఉంది. ఈ విషయాన్ని గుర్తుచేస్తూనే ఆయన వర్తమాన రాజకీయాలపై నిరాశ వ్యక్తం చేశారు. "నా 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మార్పులు చూశాను. మొదటి నుంచీ ఒకటే పార్టీ, ఒకటే నియోజకవర్గం (ఆందోల్) పట్టుకుని నిలబడ్డాను. ఎన్నో ఒడిదొడుకులు వచ్చినా జెండా మార్చలేదు" అని చెప్పుకొచ్చారు.

అయితే ఇంత నిబద్ధతతో ఉన్నా, రాజకీయాల్లో పరస్పర నమ్మకాలు లోపించాయని ఆయన బాధపడటం గమనార్హం. పదవులు ఈరోజు వస్తాయి, రేపు పోతాయి.. కానీ రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యం అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఎవరికి వార్నింగ్? అధిష్టానం వద్ద పలుకుబడి కోసం పాకులాడుతూ సీనియర్లను పక్కనబెట్టే ప్రయత్నాలు చేస్తున్న కొందరు నేతలకే ఈ చురకలు అంటించారా అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

ఇసుక దందాతో ముడిపెట్టి బురదజల్లుతున్నారా?

ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రంగా సాగుతున్న ఇసుక దందాతో మంత్రి దామోదర వర్గానికి సంబంధం ఉందంటూ కొన్ని ప్రచారాలు సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేశాయి. దీనిపై మంత్రి గట్టిగానే రియాక్ట్ అయ్యారు. "ఆ ఇసుక ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు. అసలు ఆ ఇసుక ఎక్కడుందో కూడా నాకు తెలియదు" అని ఆయన కొట్టిపారేశారు. క్లీన్ ఇమేజ్ ఉన్న తనపై కావాలనే కుట్రపూరితంగా ఇలాంటి బురదజల్లుతున్నారని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాఖాపరంగా తన పని తాను చేసుకుపోతున్నా, పదేపదే ఇలాంటి వివాదాల్లోకి తన పేరు లాగడం వెనుక సొంత పార్టీలోని ప్రత్యర్థుల హస్తం ఉందా అన్న అసహనం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది.

సొంత ప్రభుత్వంలోనే ఒక కీలక కేబినెట్ మంత్రి ఇలాంటి నిర్వేదంతో కూడిన వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ శ్రేణులను ఆలోచనలో పడేసింది. "నమ్మకాలతో నడిచే రాజకీయాలు ముగిసిపోయాయి" అంటూ దామోదర చేసిన వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మలుపులకు దారితీస్తాయో చూడాలి.

#Telangana Congress#Damodara Raja Narasimha#Telangana Politics#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి