ఆత్మహత్యాయత్నం చేయలేదన్న ఉదయ్
మద్యం మత్తులోనే సూసైడ్ నోట్?
శరీరంలో పాయిజన్ కంటెంట్ లేదన్న వైద్యులు
ఆల్కహాల్ సేవించడం వల్లే స్పృహ కోల్పోయినట్లు నిర్ధారణ
రేపు ఉదయం డిశ్చార్జ్?
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వార్తల్లో నిలిచిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి జయంతి ఆసుపత్రి వైద్యులు అధికారిక హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, అయితే స్పృహలోనే ఉన్నారని స్పష్టం చేశారు.
ఉదయ్ కృష్ణారెడ్డి ప్రస్తుతం మాట్లాడే స్థితిలోనే ఉన్నారని, ప్రత్యేక వైద్య బృందం ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తోందని సమాచారం అందించారు. వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉదయ్ కృష్ణారెడ్డికి నిరంతరం అవసరమైన పరీక్షలు నిర్వహిస్తూ, మల్టీ డిసిప్లినరీ మెడికల్ టీమ్ సంరక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగానే ఉందని జయంతి హాస్పిటల్ డాక్టర్ రవిశంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. సకాలంలో వైద్యం అందడంతో ఆయన వేగంగా కోలుకుంటున్నారని, బుధవారం ఉదయానికి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయని వైద్య వర్గాలు అభిప్రాయపడ్డాయి.
అయితే, ఆయన శరీరంలో ఎక్కడా విషపు ఆనవాళ్లు (పాయిజన్ కంటెంట్) లభించలేదని డాక్టర్ రవిశంకర్ రెడ్డి స్పష్టం చేయడం గమనార్హం. సరైన ఆహారం తీసుకోకపోవడం, దానికితోడు పరిమితికి మించి ఆల్కహాల్ సేవించడం వల్లే ఆయన స్పృహ తప్పిపడిపోయినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. రక్త పరీక్షల్లో కేవలం ఆల్కహాల్ మాత్రమే ఉన్నట్లు తేలిందన్నారు. ప్రస్తుతం గొంతు నొప్పిగా ఉండి, ఆహారం మింగడానికి కాస్త ఇబ్బందిగా ఉందని ఉదయ్ తెలపడంతో ఆ దిశగా కూడా చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ వివరించారు.
మరోవైపు స్పృహలోకి వచ్చిన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డితో మాట్లాడగా, తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని వెల్లడించినట్లు వైద్యులు తెలిపారు. తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉండటం వల్ల, మద్యం మత్తులోనే సూసైడ్ నోట్ రాసి ఉండవచ్చని, కానీ ఆ నోట్ రాసినట్లు తనకు సరైన గుర్తు లేదని ఆయన చెప్పినట్లు డాక్టర్ రవిశంకర్ రెడ్డి వివరించారు. తాగిన మైకంలో ఏం జరిగిందో సరిగ్గా గుర్తులేదని ఉదయ్ పేర్కొనడంతో, ఈ వ్యవహారంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.












