Nagarjuna: ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో రిలీజ్ డేట్ ప్రకటనలు ఒకెత్తయితే, ఆ డేట్‌కు సినిమాను థియేటర్లకు తీసుకురావడం మరో ఎత్తవుతోంది. చివరి నిమిషం వరకు రీ-రికార్డింగ్, డబ్బింగ్ మిక్సింగ్, ఎడిటింగ్ రూమ్‌లకే పరిమితమవుతూ.. థియేటర్లలో పడే సమయానికి ఫైనల్ కాపీ పంపే పద్ధతి పరిపాటిగా మారింది. దీనిపై ఇప్పటికే పలువురు పెద్దలు అసహనం వ్యక్తం చేయగా, తాజాగా అక్కినేని నాగార్జున కూడా గళం విప్పారు. అఖిల్ నటించిన 'లెనిన్' సక్సెస్ మీట్ వేదికగా చిత్ర పరిశ్రమలోని ప్రధాన లోపాలను వేలెత్తి చూపుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో జరుగుతున్న ఆలస్యం వల్ల సినిమా క్వాలిటీ దెబ్బతినడమే కాకుండా బడ్జెట్ భారీగా పెరుగుతోందని నాగ్ ఆందోళన వ్యక్తం చేశారు. `` ఒకప్పుడు విడుదల తేదీకి నెల రోజుల ముందే ఫైనల్ కాపీ చేతికి వచ్చేది. కానీ ఇప్పుడు చివరి నిమిషం వరకు ఎడిటింగ్ టేబుల్ దగ్గరే కూర్చోవాల్సి వస్తోంది. 'లెనిన్' విషయంలో కూడా ఇదే జరగడంతో రెండు వారాలు వాయిదా వేయక తప్పలేదు. హాలీవుడ్‌లో ఏడాద క్రితం ప్రకటించిన తేదీకే సినిమాను పక్కాగా తీసుకొస్తున్నారు. మన దగ్గర అంత ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నా ఎందుకు వెనుకబడుతున్నాం?`` అని నాగార్జున ప్రశ్నించారు.
ఈ సందర్భంగా కేవలం సున్నితమైన హెచ్చరికలతో సరిపెట్టకుండా.. నిర్మాతలు, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లు తమ పనితీరు మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ఏ సినిమా అయినా విడుదలకు కనీసం రెండు వారాల ముందే ఫైనల్ అవుట్‌పుట్ పోస్ట్ ప్రొడక్షన్ టీమ్‌కు అందిస్తేనే సరైన ఫలితం ఉంటుందని స్పష్టం చేశారు. వేదికపైనే నిర్మాత నాగవంశీని ఉద్దేశించి మాట్లాడిన నాగ్, ఇప్పటికైనా ఇండస్ట్రీ మేల్కొని ముందస్తు ప్రణాళికతో వ్యవహరించకపోతే ఫైనల్ కంటెంట్ దెబ్బతింటుందని హెచ్చరించారు. చిరంజీవి తర్వాత నాగార్జున కూడా వేదికపైనే ఇలా ఇండస్ట్రీ లోపాలపై క్లాస్ పీకడంతో ఈ అంశంపై టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.












