C. Joseph Vijay: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దళపతి విజయ్ ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ చుట్టూ జరుగుతున్న ప్రచారం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ కట్ చూసిన సినీప్రియులకు ఇది ఎక్కడో చూసినట్లు అనిపించడం, ఆ వెంటనే తెలుగు బ్లాక్ బస్టర్ ‘భగవంత్ కేసరి’ గుర్తుకురావడం శరవేగంగా జరిగిపోయాయి.
దీంతో ఈ సినిమా రీమేక్ అనే ప్రచారం ఊపందుకోగా, దర్శకుడు హెచ్. వినోత్ ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు మరింత కామెడీగా మారింది. "ఇది పూర్తిగా రీమేక్ కాదు.. ఫస్ట్ హాఫ్‌లో ఒక 60 శాతం, సెకండ్ హాఫ్‌లో ఒక 20 శాతం మాత్రమే పోలికలు ఉంటాయి" అంటూ ఆయన ఇచ్చిన లెక్కలు చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. మొత్తంగా 50 శాతానికి పైగా కథను తీసేసుకుని, మళ్ళీ రీమేక్ కాదు అని చెప్పడం చూస్తుంటే.. "ఇది రీమేక్ కాదు సార్, పక్కా ఫ్రీమేక్" అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది.
ఇక విజయ్ ఈ సినిమా కోసం 'భగవంత్ కేసరి'ని ఏకంగా 5 సార్లు చూశారనే వార్త విన్న అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమిళంలో డైరెక్టర్లు కొత్త కథలు రాయడం మానేశారా, లేక దళపతి చివరి సినిమాకు కూడా మన బాలయ్య బాబు మాస్ కాన్సెప్టే దిక్కయ్యిందా అని మీమ్ రాయల్స్ ఆటాడుకుంటున్నారు. అజిత్‌తో చేసిన పింక్ రీమేక్ తర్వాత మళ్ళీ రీమేక్స్ జోలికి వెళ్లనని చెప్పిన వినోత్, ఇప్పుడు విజయ్ మార్క్ విజన్ కోసం బాలయ్య కథను మిక్సింగ్ లో వేసి సరికొత్త రసగుల్లా తయారుచేశారని కామెంట్స్ వస్తున్నాయి.
ఏదేమైనా, మహిళా సాధికారత అనే పవర్ ఫుల్ పాయింట్‌ను తమిళ నేటివిటీకి, విజయ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా మార్చామని మేకర్స్ చెబుతున్నా.. జూలై 23న థియేటర్లలో విడుదలయ్యే వరకు ఈ ఫ్రీమేక్ ప్రచారం తగ్గేలా కనిపించడం లేదు. బాలయ్య బాబు ఆటిట్యూడ్, విజయ్ మాస్ ఇమేజ్ కలగలిపి రూపుదిద్దుకున్న ఈ సినిమా జూలై 23న ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే.












