సిద్దిపేట జిల్లాలో హరీష్‌రావు.. రైతు మహా పాదయాత్ర
కాళేశ్వరం జలాలను ఎత్తిపోయాలని డిమాండ్
త్వరలో మరో భారీ పాదయాత్ర అంటూ హింట్
హరీష్ లక్ష్యమేంటి..?
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ
ఎవరు అవునన్నా.. కాదన్నా బీఆర్ఎస్‌లో మంచి మాస్ ఇమేజ్ ఉన్న లీడర్ మాజీ మంత్రి హరీష్‌రావు. పార్టీలో ఎంత మంది నాయకులున్నా... ఆయన క్రేజీ ఆయనదే. తాజాగా ఆయన చేసిన ఓ పాదయాత్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని అనంతగిరి జలాశయం నుంచి రంగనాయకసాగర్ వరకు 16 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు హరీష్. వెంటనే కాళేశ్వరం జలాలను ఎత్తిపోయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్రలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఇదంతా ఓకే కానీ.. ప్రభుత్వం ముందు ఓ డిమాండ్‌ను పెట్టాలన్న లక్ష్యంతో అనూహ్యంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టడమే ఆసక్తి కలిగిస్తోంది. ఈ పాదయాత్ర 16 కిలోమీటర్లే అయినా.. హరీష్ ఈ దారిని ఎందుకు ఎంచుకున్నారా అని జనాలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారట.
వచ్చే ఏడాది తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో హరీష్ ఒక్కరోజు పాదయాత్ర చేసేశారు. ఈ రెండింటికీ ఏంటి పోలిక అనుకుంటున్నారా..? అవును ఈ రెండు పాదయాత్రలకు సంబంధం లేనే లేదు. కానీ... ఈ రెండింటినీ పోల్చి చూస్తున్నారు కొందరు విశ్లేషకులు. అందుకే ఇప్పుడు హరీష్ పాదయాత్ర తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ రాజకీయాల్లో ట్రబుల్ షూటర్‌గా, గ్రౌండ్ లెవల్ మాస్ లీడర్‌గా చెరగని ముద్ర వేసుకున్న హరీష్ రావు వైఖరి ఇప్పుడు గులాబీ శ్రేణుల్లోనే కాకుండా, ప్రత్యర్థి వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ యాత్రపై హరీష్‌రావుకు క్లారిటీ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి స్పష్టత ఉంది. కానీ... మాట్లాడుకునే వారు ఏదైనా మాట్లాడుకుంటారు కదా. అందుకే ఇప్పుడు హరీష్ పాదయాత్ర ట్రెండింగ్‌గా మారింది. వాస్తవానికి హరీష్ నాలుగు రోజులు మాట్లాడకపోయినా వార్తే. ఏదైనా అంశంపై మాట్లాడినా వార్తే. ఆఖరకు ఆయన మీడియాకు కనిపించకపోయినా వార్తే.
మండల స్థాయిలోనే హరీష్ పాదాయాత్రకు ఈ స్థాయిలో జనం తరలివస్తే.. ఇదే యాత్రను ఆయన నియోజకవర్గ స్థాయికో లేక రాష్ట్ర స్థాయికో విస్తరిస్తే ఉండే మాస్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందనే చర్చ పొలిటికల్ సర్కిళ్లలో గట్టిగా నడుస్తోందట. సోషల్ మీడియాలో ప్రచారానికంటే క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉండే లైవ్ కనెక్టివిటీయే నాయకుడి అసలైన బలం అని హరీష్ రావు మరొకసారి నిరూపించారనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత చాలామంది కీలక నేతలు వ్యూహాత్మక మౌనం దాల్చారు. కానీ.. హరీష్ రావు మాత్రం రోడ్డెక్కి రైతు సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయి పోరాటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.
హరీష్ ఏం చేసినా ఎన్నో ఊహాగానాలు
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలోకి వచ్చినా ఏనాడూ హరీష్ పార్టీ లైన్ క్రాస్ చేసింది లేదు. కానీ ఆయన ఏం చేసినా ఎన్నో ఊహాగానాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ కూడా నడుస్తుండడంతో ఎవరినీ ఆపలేని పరిస్థితి. ప్రస్తుతం కూడా అదే జరుగుతోంది. హరీష్‌రావు చురుగ్గా ఉంటూ భారీగా జనాన్ని సమీకరిస్తే.. పార్టీతో సంబంధం లేకుండా సొంత ఇమేజ్, పర్సనల్ బ్రాండ్ పెంచుకోవడానికి యత్నిస్తున్నారు అని ప్రచారం మొదలుపెడతారు. అదే సమయంలో ఆయన కొద్దిరోజులు సైలెంట్‌గా ఉంటే.. పార్టీ నాయకత్వంపై అలిగారని, విముఖతతో ఉన్నారని రకరకాల వార్తలను వండి వారుస్తారు. అయినా హరీష్ ఎప్పుడూ బ్యాలెన్స్ తప్పరు. చేయాలనుకున్న పని సైలెంట్‌గా చేసుకుంటూ వెళ్లిపోతారు.
ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రైతుల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిని, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను ఆయుధంగా మలుచుకోవడంలో హరీష్ రావు సక్సెస్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. పార్టీలో పదవులు, హోదాల కంటే జనాల్లో ఉండే బలాన్నే హరీష్ నమ్ముతారని ఆయన అనుచరులు చెబుతుంటారు. ఈ పాదయాత్ర కేవలం రైతుల కోసమే కాకుండా, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే వ్యూహాత్మక అడుగుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవుతున్న తరుణంలో, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావడానికి దీనిని ఒక వేదికగా మార్చుకుంటున్నారు హరీష్. సిద్దిపేటలో ఆయన చేసిన యాత్రకు ఊహించని రీతిలో భారీ స్పందన లభించడంతో, పార్టీ అంతర్గత రాజకీయాల్లోనూ, రాష్ట్రవ్యాప్తంగానూ హరీష్ రావు గ్రాఫ్ మరోసారి పెరిగినట్లయింది.












