గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వ్యవహారం పెనుదుమారం లేపింది. ఏకంగా సీబీఐ, ఈడీలు సైతం ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాయి. లిక్కర్ స్కామ్ కేసులో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పక్కదారి పట్టించారని, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. నాడు వైసీపీ హయాంలోనే దీని మీద విచారణ జరగగా.. ఏపీలో కూటమి సర్కార్ వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు సిట్ విచారణకు ఆదేశించారు.
నాటి నుంచి ఈ కేసులో ఎవరెవరికి ఇన్వాల్వ్ మెంట్ ఉందని అధికారులు ఆరా తీయడం మొదలెట్టారు. ఓవైపు సీబీఐ విచారణతో పాటే సిట్ కూడా దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన వారిని గుర్తించారు. మద్యం రవాణా టెండర్ల కుంభకోణంలో ఈ అవినీతి జరిగింది.ఇందులో ముగ్గురు ప్రధాన నిందితులను గుర్తించారు. అనంతరం వారిని విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరచగా.. న్యాయస్థానం ఆగస్టు 3 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) మాజీ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి (A1), మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ (A4), రాజ్ కసిరెడ్డి (A8)లకు కోర్టు రిమాండ్ విధించింది.అయితే,ఏకంగా రూ.192 కోట్ల నష్టం ప్రభుత్వ ఖజానాకు వాటిల్లిందని సిట్ తన రిమాండ్ రిపోర్ట్‌లో ఆరోపించింది.ఈ విషయాన్ని కోర్టుకు తెలపడంతో న్యాయస్థానం నిందితులకు రిమాండ్ విధించింది.












