రూ.15 వేల కోట్లతో పాలసీ ప్రవేశ పెట్టినా అమలు అంతంతే?
మేఘా కంపెనీకి అనంతగిరిలో 81 ఎకరాలు 99 ఏండ్ల లీజు?
శాఖాధిపతుల విదేశీ టూర్లకే రూ.10 కోట్ల వరకు ఖర్చు?
విదేశీ విజిటర్స్‌లో 12వ స్థానం.. స్వదేశీ పర్యటకుల్లో 7కు దిగజారిన వైనం
ప్రతిష్టాత్మక నిథిమ్ కాలేజీలో అక్రమాలు
జహీరాబాద్ కాలేజీకి రూ.5 కోట్లు ఇచ్చినా తెరుచుకోలేదు
టూరిజం హోటల్స్‌పై కొరవడిన నియంత్రణ
నాణ్యతను గాలికి వదిలేసిన వైనం
రూ.12 కోట్లతో పెట్టిన తెలంగాణ దర్శని పథకం జాడలేదు?
ఇతర రాష్ట్రాలకు మన పర్యాటకులను పంపించడమే బిజినెస్ అంట?
ఆనాడు దోచుకు తిన్నారని కేసులు అయ్యాయి
ఈనాడు పట్టించుకునే నాథుడే కరువయ్యారా?
వరల్డ్ టూరిజం డే సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ ఏఐ అని చెప్పుకుంటూ ఒకరోజు ముందే మౌనంగా జరుపుకుంటోంది
పాలసీ ఉన్నా ప్రగతి లేని పర్యాటక రంగంపై స్వేచ్ఛ న్యూస్ ప్రత్యేక కథనం
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,
9848070809,
స్వేచ్ఛ న్యూస్ చైర్మన్.
గత ఏడాది ప్రపంచ అందాల పోటీలు.. నేడు చడీచప్పుడు లేకుండా టూరిజం డే
ప్రపంచ పర్యాటక దినోత్సవం 2026 థీమ్ ఏంటో తెలుసా. పర్యాటక రంగాన్ని పునరుద్ధరించేందుకు డిజిటల్ అజెండా ఏఐ. కానీ, టెక్నాలజీ యుగంలో ఆ ఉత్సాహం లేదు. భవిష్యత్ ప్రణాళికలు కానరావడం లేదు. ప్రభుత్వం రాగానే 10 ఏండ్లుగా టూరిజం పాలసీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2024లో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2030 వరకు పాలసీ అంటూ 2025 మార్చి 17న అమల్లోకి తెచ్చారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 3 లక్షల ఉద్యోగాలు, టాప్ 5 రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలని ఏదేదో చెప్పారు. దీనికి తోడుగా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రూ.7 వేల కోట్లు, మొత్తం రూ.22 వేల కోట్లతో ప్రతిపాదనలు వచ్చాయి. 14 పీపీపీ ప్రాజెక్ట్స్‌కు రూ.7 వేల కోట్లు, 16 ప్రైవేట్ ప్రాజెక్ట్స్‌కు రూ.8 కోట్లు అన్నారు. రెండేళ్ల లోపు పనులు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ, ఇంకా మొదలు కానివి ఎన్నో ఉన్నాయి. కేంద్ర పథకాల ప్రాజెక్ట్స్‌లో రూ.275 కోట్లు రావాలి. ఇందుకు ఎకో టూరిజం, భువనగిరి కోట, బుద్ధవనం, రామప్ప, సోమశిల, నిజాంసాగర్, బల్కంపేట్ ఎల్లమ్మ గుడి ఇలా 6 క్లస్టర్లుగా 27 ప్రాంతాలును గుర్తించారు. 9 తీర్ధయాత్ర సర్క్యూట్లు, హెలీ టూరిజం, 100 వీకెండ్ వండర్స్ అన్నారు.
మేఘా డీల్ కొట్టేశారు?
అనంతగిరి కొండల్లో ఎంఈఐఎల్ కంపెనీ 81 ఎకరాలను 99 ఏండ్లు లీజుకు తీసుకున్నది. వెయ్యి కోట్లు పెట్టుబడి పెడుతోంది. మరో 3 నెలల్లో మొదటి దశ పూర్తి చేయాలి. ఈ ప్రాజెక్ట్‌లో లగ్జరీ విల్లాలు, సూట్‌లు, యోగా, మెడిటేసన్, ఆయిర్వేదం, పంచకర్మ, హైడ్రో థెరపీ, స్పా, అర్గానిక్ ఫుడ్ సదుపాయాలు ఉండాలి. పోటీగా సింగపూర్, బాలీ నుంచి పేర్లు వచ్చినా మేఘా కృష్ణారెడ్డికే కట్టబెట్టారు. 15 ఏండ్లు వంద శాతం స్టేట్ జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ కల్పించారు. 10 ఏండ్లు 3 శాతం వడ్డీ సబ్సిడీ, 15 ఏళ్లు కరెంట్ బిల్లులో రూ.3 పవర్ సబ్సిడీ, రిజిస్ట్రేషన్, కన్వర్షన్ ఛార్జీలు పూర్తిగా ఇచ్చేయాలి. ఎంఈఐఎల్ ఎస్పీవీ కనీస వాటా 51 శాతం ఉంచాలని షరతులు ఉన్నాయి.
ర్యాంకులో దిగజారుడే?
గత ఐదు సంవత్సరాల్లో యూపీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు రోజురోజుకు పర్యాటకులను ఆకట్టుకుని స్థానాలను మెరుగుపర్చుకుంటున్నాయి. కానీ, తెలంగాణ వెనకబడుతోంది. రాష్ట్రానికి 18 కోట్ల మంది దేశీయ పర్యాటకులు వస్తే, అంతర్జాతీయంగా లెక్కగడితే 1.71 లక్షల మందే వచ్చారు. దీంతో 12వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
టూర్లకు కోట్ల రూపాయలు ఖర్చు
అంతర్జాతీయ పర్యాటనల పేరుతో ప్రజా ధనం ఇప్పటికి దాదాపు రూ.10 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. లండన్ వరల్డ్ ట్రావెల్ మార్ట్, బెర్లిన్, ఐటీబీ, మాడ్రిడ్, పిటూర్, లాస్ వెగాస్, ఐఎంఈఎక్స్, థాయ్ లాండ్ పాతా వంటి అంతర్జాతీయ ట్రావెల్ పెయిర్లతో అక్షరాలా రూ.9.94 కోట్లు ఖర్చు చేశారు. కానీ, పర్యాటకులను తీసుకరావడంలో అధికారులు వెనుకబడ్డారు. రష్యా, చైనా, జపాన్ టూర్ల వివరాలు ఆర్టీఐలో ఇవ్వడం లేదు.
ఉపాధి నైపుణ్యాలు లేవు.. ఉద్యోగాలు లేవు
జహీరాబాద్‌లోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ గత కొన్ని సంవత్సరాలుగా మూతపడి శిథిలావస్థకు చేరడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. పర్యాటక వారోత్సవాల సందర్భంగా పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారుల బృందంతో కలిసి ఈ క్యాంపస్‌ను సందర్శించి, పునరుద్ధరణ కోసం రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు గొప్పగా ప్రకటించారు. కానీ, నేటి వరకు ఆ నిధులు విడుదల కాలేదు. విద్యార్థులలో పర్యాటక స్ఫూర్తిని పెంపొందించడానికి రెండేళ్ల క్రితం రూ.12.5 కోట్ల బడ్జెట్‌తో ప్రకటించిన 'తెలంగాణ దర్శిని' పథకం కింద ఎంతమంది విద్యార్థులు లబ్ది పొందారనే దానిపై లెక్కలు లేవు. రాష్ట్ర పర్యాటక ప్రచారం అంతా కేవలం షిర్డీ, తిరుపతి వంటి ప్రాంతాలకు అవుట్‌బౌండ్ యాత్రలకే పరిమితమైంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాల నుండి పర్యాటకులను హైదరాబాద్‌కు రప్పించేందుకు ఎలాంటి వ్యూహాత్మక ప్రచారమూ లేదు. లీజులు ఇస్తూ పుట్టగొడుగులా వెలుస్తున్న చిన్న హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతా ప్రమాణాలు, నాణ్యత నియంత్రణ గాలికి కొట్టుకుపోతున్నా పర్యాటక శాఖ పట్టించుకోవడం లేదు.
జవాబుదాదీతనం ఏది?
పర్యాటక శాఖలో ప్రధానంగా ఎగ్జిక్యూషన్ ఉండాలి. పారదర్శకత అవసరం. విజన్ ఉండాలి. కానీ, ఇవేమి కనపడడం లేదు. కేవలం అవగాహన ఒప్పందాలు, కాంక్లేవ్ ప్రకటనలు, మంత్రుల హామీలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయించాలి. సాధారణ మతపరమైన యాత్రలకే పరిమితం కాకుండా, పొరుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులను ఆకర్షించేలా సరికొత్త ప్యాకేజీలను రూపొందించాలి. రాష్ట్ర పర్యాటక రంగానికి వెన్నుదన్నుగా నిథమ్ కాలేజీ ఉండేది. నేడు వంద మంది విద్యార్థులు కూడా లేక దీనావస్థలో కొట్టుమిట్టాడుతోంది. నిరంతరం ఆర్థిక దుర్వినియోగం, కాంట్రాక్ట్ సిబ్బందిపైనే ఆధారపడటం సంస్థ ప్రారంభమైన నాటి నుండి పర్యాటక రంగంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను డైరెక్టర్లుగా నియమిస్తుండడంతో, ఈ సంస్థ తన అసలు లక్ష్యాన్ని కోల్పోయి చరిత్రలో కలిసిపోయే దుస్థితికి చేరుకుంది.










