తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరనారి, బహుజన ధీరత్వానికి ప్రతీక అయిన చాకలి (చిట్యాల) ఐలమ్మ జయంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు 'ఎక్స్'(ట్విట్టర్) వేదికగా ఆయన ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకుంటూ, తెలంగాణ మట్టి గడ్డపై ఐలమ్మ చూపిన పోరాట పటిమ, చేసిన త్యాగాలు భావితరాలకు నిరంతరం ఆదర్శంగా నిలుస్తాయని కొనియాడారు.

తొలి భూపోరాటానికి నాంది పలికి, దొరల అన్యాయాలకు, ప్రజా వ్యతిరేక నైజాం పాలనకు వ్యతిరేకంగా దండెత్తిన నిప్పుకణిక చిట్యాల ఐలమ్మ అని కేటీఆర్ అభివర్ణించారు. ఆమె కనబరిచిన ధైర్యం, ఆత్మగౌరవ పోరాటం తెలంగాణ వీరత్వానికి, ప్రతిఘటన స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. బహుజన మహిళగా అణచివేతపై ఆమె తిరగబడిన తీరు చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని అన్నారు.
స్వరాష్ట్రంలో చాకలి ఐలమ్మ పోరాట సేవలను మరియు త్యాగాలను సముచితంగా గుర్తించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని కేటీఆర్ గుర్తుచేశారు. ఐలమ్మ స్మృత్యర్థం పాలకుర్తి మార్కెట్ యార్డుకు ఆమె పేరు పెట్టడమే కాకుండా, రాబోయే తరాలకు ఆమె వీరగాథ తెలియాలనే ఉద్దేశంతో పాఠశాల పాఠ్యాంశాల్లో ఐలమ్మ జీవిత చరిత్రను చేర్చామని తెలిపారు.
అంతేకాకుండా, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించే సాంప్రదాయాన్ని తీసుకొచ్చామని స్పష్టం చేశారు. ఐలమ్మ చూపిన పోరాట బాటలోనే తెలంగాణ సమాజం ఎల్లప్పుడూ ఆత్మగౌరవంతో ముందుకు సాగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భగా తెలంగాణ ప్రజలందరికీ చాకలి ఐలమ్మ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆమె స్మృతికి ప్రణమిల్లుతున్నట్లు వెల్లడించారు.









