హైదరాబాద్‌లో గణేశ్ శోభాయాత్రలు, నిమజ్జనాలు కొనసాగుతూనే ఉన్నాయి. లక్షలాది మంది భక్తులు ఉత్సవాల్లో పాల్గొనడంతో నగరం అంతటా పండుగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్(CP) వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. నగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిన్నటి(శుక్రవారం) నుంచి అత్యంత ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతోందని సీపీ తెలిపారు. ఉత్సవాలు సజావుగా సాగేందుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరిస్తున్న నగర ప్రజలందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, లిబర్టీ, మోజంజాహీ మార్కెట్ తదితర కీలక ప్రాంతాలకు భక్తులు భారీగా తరలిరావడంతో వాహనాల రాకపోకలు మందగించాయని సీపీ తెలిపారు. ఈ రద్దీ కారణంగా నిమజ్జన ప్రక్రియ కాస్త ఆలస్యమైందని, శోభాయాత్ర నేటి మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. మిగిలి ఉన్న విగ్రహాల నిమజ్జనాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు పోలీస్, ట్రాఫిక్ విభాగాల సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని స్పష్టం చేశారు.
శోభాయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను నేడు(శనివారం) కూడా పొడిగిస్తున్నట్లు సీపీ సజ్జనార్ ప్రకటించారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీ స్టాచ్యూ, ఇందిరాగాంధీ రోటరీ పరిసరాల్లో విగ్రహాల రద్దీ ఎక్కువగా ఉన్నందున సాధారణ వాహనాలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. అత్యవసరమైతే తప్ప సాధారణ వాహనదారులు ఈ మార్గాల్లో ప్రయాణించవద్దని సూచించారు.
ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ చిక్కుల్లో పడి ఇబ్బందులు ఎదుర్కోవద్దని నగరవాసులకు సూచించారు. ట్రాఫిక్ విభాగం ఎప్పటికప్పుడు జారీ చేసే అధికారిక సూచనలు మరియు ట్రాఫిక్ అడ్వైజరీలను గమనిస్తూ, నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు పోలీసు యంత్రాంగానికి పూర్తిస్థాయిలో సహకరించాలని కమిషనర్ కోరారు.











