తెల్లవారుజామున కనిపించే కలలకు మన ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా సూర్యోదయానికి ముందు ఉండే సమయాన్ని బ్రహ్మ ముహూర్తంగా భావిస్తారు. ఈ సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉండటంతో పాటు, బాహ్య ప్రపంచంతో సంబంధం కొంత తగ్గి అంతర్ముఖ స్థితి పెరుగుతుందని ఆధ్యాత్మిక సంప్రదాయం చెబుతుంది. అందుకే ఈ సమయంలో కనిపించే కొన్ని స్వప్నాలను సాధారణ కలల కంటే ప్రాధాన్యంగా చూసే ఆచారం ఏర్పడింది.
అయితే తెల్లవారుజామున వచ్చిన ప్రతి కల భవిష్యత్తులో తప్పకుండా నిజమవుతుందని శాస్త్రాలు చెప్పలేదు. అగ్ని పురాణంలోని స్వప్నాధ్యాయంలో రాత్రిని వివిధ భాగాలుగా విభజించి, ఏ సమయంలో స్వప్నం కనిపిస్తే దాని ఫలితం ఎప్పుడు కలుగుతుందనే విషయాన్ని వివరిస్తుంది. రాత్రి మొదటి భాగంలో కనిపించిన స్వప్నాలకు ఎక్కువ కాలం తర్వాత ఫలితం ఉంటుందని, తరువాతి భాగాల్లో కనిపించే స్వప్నాలకు తక్కువ కాలంలో ఫలితం ఉంటుందని, సూర్యోదయ సమీపంలో కనిపించే స్వప్నానికి మరింత త్వరగా ఫలితం కలుగుతుందని పేర్కొంటుంది.
బృహదారణ్యక ఉపనిషత్తు స్వప్నాన్ని మనస్సు అంతర్గతంగా సృష్టించుకునే ఒక ప్రత్యేక అనుభవంగా వివరిస్తుంది. మేల్కొని ఉన్నప్పుడు మనకు కలిగిన అనుభవాలు, ఆలోచనలు, కోరికలు, భయాలు మనస్సులో ముద్రలుగా నిలిచి, స్వప్నంలో కొత్త రూపాల్లో ప్రత్యక్షమవుతాయని ఉపనిషత్తు వివరణలో కనిపిస్తుంది. అలాగే మాండూక్య ఉపనిషత్తు కూడా స్వప్నావస్థను ఆత్మ అనుభవించే ప్రత్యేక స్థితిగా పేర్కొంటుంది.
దీనిని తైజస స్థితిగా వివరిస్తూ, ఇక్కడ చైతన్యం బాహ్య వస్తువుల కంటే అంతర్గత అనుభవాల వైపు పనిచేస్తుందని చెబుతుంది. అంటే ప్రతి కలను భవిష్యవాణిగా చూడటం కంటే, అది మన అంతరంగాన్ని ప్రతిబింబించే అవకాశం కూడా ఉందన్నది ఉపనిషత్తుల లోతైన సందేశం. స్వప్న శాస్త్ర సంప్రదాయంలో మాత్రం కొన్ని స్వప్నాలను శుభసూచకాలుగా, మరికొన్నింటిని అశుభసూచకాలుగా పరిగణించారు.
అవి ఏనుగు, గుర్రం, ఎద్దు, తెల్లని వస్త్రాలు, నిర్మలమైన నీరు, పర్వతాన్ని అధిరోహించడం వంటి కొన్ని దృశ్యాలను అగ్ని పురాణం శుభసూచకాలుగా పేర్కొంటుంది. అందుకే తెల్లవారుజామున వచ్చిన కలను వెంటనే భవిష్యత్తు తీర్పుగా భావించడం కంటే, దాని స్వభావాన్ని, మన మనస్సులో ఉన్న ఆలోచనలను, కలలోని సంకేతాలను ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలించడం మరింత సముచితం.
స్వప్నం కేవలం భవిష్యత్తు చెప్పే దృశ్యం మాత్రమే కాదు.. మనస్సు, చైతన్యం, అంతరంగాన్ని అర్థం చేసుకునే ఒక మార్గంగా కూడా భావించబడింది. అందుకే కళలు వస్తే భయపడకుండా.. మన అంతరంగాన్ని పరిశీలించుకునే ఒక ఆధ్యాత్మిక సంకేతంగా చూడటమే ఉత్తమం అని పండితులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.












