ప్రపంచ ప్రసిద్ధ టెక్నాలజీ దిగ్గజ సంస్థ యాపిల్ (Apple) నాయకత్వంలో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. గడిచిన 15ఏళ్లుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO)గా కంపెనీని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లిన టిమ్‌కుక్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. సెప్టెంబర్ 1 నుంచి యాపిల్ నూతన సీఈఓగా జాన్ టెర్నస్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. 2011 ఆగస్టులో దిగ్గజ నేత స్టీవ్ జాబ్స్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన టిమ్‌కుక్, ఇకపై యాపిల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు.
ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ హోదాలో కుక్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల ప్రభుత్వాలు, విధాన నిర్ణేతలతో సంబంధాలను పర్యవేక్షించడంతో పాటు సంస్థకు సంబంధించిన పలు కీలక వ్యూహాత్మక వ్యవహారాల్లో మద్దతు అందిస్తారు. ఇదే సమయంలో జాన్ టెర్నస్ యాపిల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో భాగస్వామిగా చేరారు. 2001లో ప్రొడక్ట్ డిజైన్ విభాగంలో మెకానికల్ ఇంజనీర్‌గా యాపిల్‌లో చేరిన టెర్నస్, 2021నాటికి హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎదిగారు. ఐఫోన్, ఐపాడ్, మ్యాక్, ఎయిర్‌పాడ్స్, విజన్ ప్రో వంటి విప్లవాత్మక ఉత్పత్తుల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు.
టిమ్ కుక్ నాయకత్వంలో యాపిల్ అపూర్వమైన ఆర్థిక వృద్ధిని సాధించింది. ఆయన సీఈవోగా బాధ్యతలు స్వీకరించే సమయానికి కంపెనీ మార్కెట్ విలువ 350 బిలియన్లుగా ఉండగా, ప్రస్తుతం అది దాదాపు 4 ట్రిలియన్ల భారీస్థాయికి చేరుకుంది. 2011లో 108 బిలియన్లుగా ఉన్న వార్షిక ఆదాయం ప్రస్తుతం 400 బిలియన్ మార్కును దాటింది. కేవలం హార్డ్‌వేర్ అమ్మకాలకే పరిమితం కాకుండా యాప్ స్టోర్, యాపిల్ మ్యూజిక్, యాపిల్ పే వంటి సర్వీసెస్ విభాగం ద్వారానే ఏడాదికి 100 బిలియన్లకు పైగా ఆదాయం వచ్చేలా కుక్ పటిష్టమైన ఈకోసిస్టమ్‌ను నిర్మించారు.
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో తీవ్రమైన పోటీ నెలకొన్న కీలక సమయంలో టెర్నస్ బాధ్యతలు స్వీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. యాపిల్ తన సురక్షితమైన ఈకోసిస్టమ్‌ను, భారీ వినియోగదారుల స్థావరాన్ని కాపాడుకుంటూనే, ఏఐ పరిజ్ఞానంలో ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేలా కొత్త వ్యూహాలను అమలు చేయాల్సిన పెద్ద బాధ్యత ఇప్పుడు టెర్నస్‌పై ఉంది.












