పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్, నరోవల్ జిల్లా సిరాజ్ గ్రామంలో 125 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పురాతన హిందూ దేవాలయం కూల్చివేతకు గురికావడం తీవ్ర వివాదానికి దారితీసింది. సుమారు 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ చారిత్రక ఆలయాన్ని ఆగస్టు 21న నిషేధిత తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్థాన్ (టీఎల్‌పీ) పార్టీకి చెందిన మత ఛాందసవాదులు ఉద్దేశపూర్వకంగానే కూల్చివేశారని హక్కుల సంఘాలు, మైనారిటీ సంస్థలు ఆరోపిస్తున్నాయి.
ఆలయ భూమిని పక్కనే ఉన్న మదర్సాలో కలిపేందుకు ఈ కుట్ర పన్నారని, ఆలయ శిఖరానికి ఉన్న లోహపు సామగ్రి, ఇటుకలను కూడా దుండగులు అమ్ముకున్నారని మైనారిటీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పాకిస్థాన్ మసిహా మిల్లత్ పార్టీ (పీఎంఎంపీ)తో పాటు స్థానిక హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో స్పందించాయి. పంజాబ్ ముఖ్యమంత్రి మర్యం నవాజ్ షరీఫ్ ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, ఆలయాన్ని యథావిధిగా పునర్నిర్మించాలని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
ఆలయానికి కేటాయించిన స్థలాన్ని గతంలోనే అక్రమంగా ఆక్రమించారని, ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని ఈటీపీబీ (ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్) ఆదేశాలు ఇచ్చినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మైనారిటీ నేత రతన్ లాల్ విమర్శించారు. ప్రస్తుతం అక్కడ మదర్సా కొనసాగుతుండటంతో కూల్చివేసిన ప్రాంగణానికి వెళ్లేందుకు కూడా స్థానిక హిందువులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
అయితే స్థానిక అధికారులు, ఈటీపీబీ ప్రతినిధులు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగానే అత్యంత పాతదైన ఈ ఆలయ నిర్మాణం కూలిపోయిందని, ఎవరూ కావాలని కూల్చివేయలేదని వాదిస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణంపై ఉన్నతాధికారులు త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఏది ఏమైనప్పటికీ, పాకిస్థాన్‌లో మైనారిటీల ఆరాధనా స్థలాలకు రక్షణ లేకుండా పోతోందనడానికి ఈ ఘటన మరొక నిదర్శనంగా నిలిచింది.











