భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోడీ మరోసారి వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా దేశప్రజలకు కీలక సందేశం పంపారు. మంగళవారం ఉదయం సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2026-2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశం 7.8 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేయడంపై ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ విజయం భారతీయుల సంకల్పం, కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఘనత మన సమిష్టి బలాన్ని ప్రతిబింబిస్తోందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా క్లిష్టమైన ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ జీడీపీ పెరుగుదల దేశ అభివృద్ధిని సూచిస్తోందని చెప్పుకొచ్చారు. ప్రపంచ దేశాలు యుద్ధాలతో సతమతం అవుతుంటే భారత్ మాత్రం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. 2020లో సంభవించిన కరోనా విజృంభన తరవాత ప్రపంచవ్యాప్తంగా అస్థిరత నెలకొందని, అయినప్పటికీ మన దేశం వేగంగా పురోగమిస్తోందని తెలిపారు.
అయితే, దేశంలో నిరాశవాద అగాధంలో కూరుకుపోయి, అబద్దాలు చెబుతూ నిస్పృహను వ్యాపింపజేసేవారు చాలా మందే ఉన్నారని, వాటన్నింటినీ అధిగమించి, అడ్డంకులను ఛేదించుకుని దేశం 7.8 శాతం వృద్ధి రేటు సాధించడం గొప్ప విషయం అన్నారు. మనం ఈ వేగాన్ని ఇకముందు కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు. ఇదే పంథాలో ముందుకు సాగుతూనే ఉండాలని చెప్పారు. అందుకోసం ఆత్మనిర్భర్ భారత్ ఎంతో అవసరం అని మోడీ అభిప్రాయపడ్డారు.
ఇక ముందు కూడా ప్రజలు స్వదేశీ మంత్రంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విదేశాల్లో వివాహాలు చేసుకోవద్దని, విదేశీ పర్యటనలకు వెళ్లొద్దని సూచించారు. ఇండియాలోనే పెళ్లిళ్లు, ఇక్కడి పర్యటకానికి ప్రయారిటీ ఇవ్వాలన్నారు. అలా చేయడం వలన విదేశీ మారక ద్రవ్యం ఎంతో మిగులుతుందని, బయటకు వెళ్లదని చెప్పారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ ఛాత్రోన్ కీ గూంజ్ క్యాంపెయిన్‌ను పరోక్షంగా విమర్శిస్తూ ‘ఝూట్ కీ గూంజ్’ అది అబద్దాల ఉద్యమం అని ప్రధాని కౌంటర్ ఇచ్చారు. ఇదిలాఉండగా, ప్రధాని మోడీ విడుదల చేసిన సందేశంపై మరోసారి ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి.












