అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే సికింద్రాబాద్ మద్రాసు ఆర్మీ రెజిమెంట్‌లో భారీగా ఆయుధాలు చోరీ అయినట్టు తెలుస్తోంది. ఆర్మీ పరిసరాల్లోకి సామాన్య మానవుడు ఎవరూ ప్రవేశించలేరు. అందులో పనిచేసేవారికి అధికారులు, ఐడీ కార్డు కలిగిన వారికి మాత్రమే లోనికి ప్రవేశం ఉంటుంది.సీసీ కెమెరాలతో పాటు భద్రతా సర్వేలెన్స్ కూడా నిత్యం గమనిస్తుంటుంది.అంతటి కట్టుదిట్టమైన భద్రతా నడుమ ఆయుధాలు ఎలా మిస్ అయ్యాయి అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిలిగింది.
రెజిమెంట్‌లోకి చొరబడ్డ దొంగలు 12 అత్యాధునికమైన ఆయుధాలను ఎత్తుకెళ్లినట్టు సమాచారం.దీనిపై అధికారులు బొల్లారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. గది తాళాన్ని పగలగొట్టి 12 ఆయుధాలు ఎత్తుకెళ్లగా.. అందులో నాలుగు ఏకే 47, ఆరు పిస్టల్స్ ఉన్నట్టు సమాచారం.అంతేకాకుండా ఒక ఇన్సాస్ రైఫిల్‌తో పాటు పెద్ద మొత్తంలో మందుగుండును కూడా ఎత్తుకెళ్లినట్టు అధికారులు గుర్తించారు.
ఆయుధాలు దొంగతనానికి గురవ్వడంపై ఆర్మీ అధికారులు బొల్లారం పీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిసింది. ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉన్న మద్రాసు రెజిమెంట్‌లోకి దుండగులు ఎలా ప్రవేశించారు? ఆయుధాలు భద్రపరిచిన గదిలోకి వద్దకు ఎలా వెళ్లారు? తాళం పగులగొట్టి ఆయుధాలు తీసుకుని వెళ్లే సమయంలో భద్రతా సిబ్బంది ఎటు వెళ్లారు? ఇలా అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.
దేశ భద్రతకు సంబంధించిన విషయం కావడంతో విషయం బయటకు వెళ్లకుండా గుప్తంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.కాగా, పెద్దఎత్తున ఆయుధాలు మిస్ కావడంతో ఆర్మీ ఉన్నతాధికారులు కూడా అంతర్గత విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది.లోపలి వ్యక్తుల హస్తం ఏమైనా ఉందా?దుండగులకు సహకరించారా?అన్న కోణంలోనూ విచారణ జరుగుతున్నట్టు సమాచారం.












