భారత ఐటీ, టెక్నాలజీ ఉద్యోగ మార్కెట్‌లో దాదాపు మూడేళ్లుగా నెలకొన్న మందగమనం తొలగిపోయి నియామకాల ప్రక్రియ మళ్లీ పుంజుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వంటి రంగాల్లో ప్రతిభ ఉన్న అభ్యర్థులకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఏఐ విస్తరణ వల్ల ఉద్యోగాలపై ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ, భారత్‌లో మాత్రం టెక్ దిగ్గజాలు కొత్త రిక్రూట్‌మెంట్‌పై దృష్టిపెట్టాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ టెక్ విభాగాల్లో దాదాపు 1.50లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ముఖ్యంగా ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, జనరేటివ్ ఏఐ విభాగాల్లో నిపుణులకు భారీ వేతన ప్యాకేజీలు లభిస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, అమెజాన్, యాక్సెంచర్ వంటి అగ్రగామి సంస్థలు ఏఐ నిపుణుల కోసం రూ.12లక్షల నుంచి ఏకంగా రూ.60లక్షల వరకు వార్షిక వేతనాలు ఆఫర్ చేస్తున్నాయి. కేవలం ఏఐ మాత్రమే కాకుండా క్లౌడ్ ఆర్కిటెక్ట్, డెవ్‌ఆప్స్, ఫుల్‌స్టాక్ డెవలపర్, సైబర్ సెక్యూరిటీ రోల్స్‌కి కూడా రూ.10లక్షల నుంచి రూ.45లక్షల రేంజ్‌లో భారీ ప్యాకేజీలు లభిస్తున్నాయి. నాన్-ఐటీ రంగాలు అయిన బ్యాంకింగ్, ఫైనాన్స్, హెల్త్‌కేర్, ఆటోమోటివ్ సంస్థలు కూడా డిజిటలైజేషన్‌లో భాగంగా ఐటీ నిపుణులను భారీగా తీసుకుంటున్నాయి.
ఇప్పటివరకు కేవలం అనుభవజ్ఞులకే పరిమితమైన కంపెనీలు ఇప్పుడు ఫ్రెషర్ల నియామకాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్, డెలాయిట్ వంటి ప్రముఖ సంస్థలు ఫ్రెషర్లకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. బీఈ, బీటెక్, ఎంసీఏతో పాటు బీసీఏ, బీకామ్, బీఎస్సీ గ్రాడ్యుయేట్లకు కూడా రూ.3.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు ఆకర్షణీయ వార్షిక ప్యాకేజీలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. 2024లో చదువు పూర్తి చేసిన వారిని కూడా కొన్ని సంస్థలు పరిగణనలోకి తీసుకుంటుండటం విశేషం.
భారత్‌లో 'గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు' (GCC) వేగంగా విస్తరించడమే ఈ ఉద్యోగాల పెరుగుదలకు ప్రధాన చోదక శక్తిగా మారింది. ప్రపంచ స్థాయి ప్రాజెక్టులు, డేటా అనలిటిక్స్, క్లౌడ్ ప్రాసెస్ సంబంధిత పనులు భారత్‌కు తరలిరావడంతో నిపుణుల అవసరం రెట్టింపైంది. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలను (Up-skilling) నేర్చుకునే అభ్యర్థులకు ప్రస్తుత ఐటీ మార్కెట్ సువర్ణ అవకాశాలను అందిస్తోందని రిక్రూట్‌మెంట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.












