కాలం మారుతోంది.. కానీ సామాన్యుడి బ్రతుకు మాత్రం మారడం లేదు!.. ఒకవైపు పెరుగుతున్న ధరలు.. మరోవైపు ప్రకృతి విపత్తులు.. మధ్య, పేద తరగతి ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి.. ఇక ఒకటో తారీఖు వస్తే.. అమ్మో ఒకటో తారీఖు అని భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి.. పేద వారిని మరచిపోతున్న ప్రభుత్వాలు ఒకటో తారీఖు వస్తే చాలు ధరల పెంపుపై దృష్టి సారించడం అనివార్యమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..
ముఖ్యంగా E20 పెట్రోల్ వల్ల జనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలిసిందే.. ఇక చక్కర ధరలు పెరగడం వల్ల టీ తో పాటు స్వీట్స్ ధరలు విపరీతంగా పెరిగాయనే ఆరోపణలున్నాయి.. గతంలో ఏర్పడిన గ్యాస్ కొరత వల్ల చిన్న చిన్న హోటల్ వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అలాగే సామాన్యుడు హోటల్స్ లో తినే పరిస్థితి లేదు. ఈ క్రమంలో వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు మరోసారి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి.
సెప్టెంబర్ నెల ప్రారంభం కాగానే 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయంతో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలపై నిర్వహణ భారం మరింత పెరగనుందని తెలుస్తుంది. మరోవైపు గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయకపోవడంతో సామాన్య ప్రజలకు పెద్ద ఊరట లభించినట్టైంది..
ఇక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై రూ. 9.50 పెరగడంతో, ప్రస్తుత ధర రూ. 2,747.50కి చేరింది. ముంబైలో కూడా రూ. 9.50 పెంపుతో ధర రూ. 2,691.50 నుంచి రూ. 2,701కి ఎగబాకింది. అలాగే హైదరాబాద్ లో కమర్షియల్ సిలిండర్ ధరపై రూ. 11 పెరిగింది. దీంతో ఇక్కడ సిలిండర్ ధర రూ. 2,996కి చేరుకుంది.. అంటే దాదాపు రూ.3,000కు దగ్గరగా ఉంది.
అదేవిధంగా చెన్నైలో రూ. 10.50 పెంపుతో కొత్త ధర రూ. 2,916.50గా నమోదైంది. అయితే గత ఆగస్టు నెలలో ఆయిల్ కంపెనీలు వాణిజ్య సిలిండర్ల ధరలను స్వల్పంగా తగ్గించిన, ఈ నెలలో మళ్లీ పెంచడం గమనార్హం.. మరోవైపు వాణిజ్య సిలిండర్ల ధరలు పెరిగినప్పటికీ, సామాన్యులు వినియోగించే 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ల ధరలను మాత్రం స్థిరంగా కొనసాగించారు.
ప్రస్తుతం గృహ వినియోగ సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ. 994 ఉండగా.. ఢిల్లీలో రూ. 942, ముంబైలో రూ. 941.50గా ఉంది. మొత్తం మీద, కమర్షియల్ గ్యాస్ ధరలు పెరిగిన.. ఇంటి అవసరాలకు ఉపయోగించే సిలిండర్ ధరలు మాత్రం పెంచక పోవడం ఊరటనిస్తుంది..












