సమగ్ర భూ సర్వే లోపాలు, అధికారుల నిర్లక్ష్యం కలసి రాష్ట్రంలో మరో రెవెన్యూ సంక్షోభానికి దారితీస్తున్నాయి. శతాబ్దాలుగా సాగులో ఉన్న నిరుపేద రైతుల పట్టా భూములను యథేచ్ఛగా నిషేధిత జాబితా (22A) కింద నమోదు చేయడంతో, రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల భూములకు సంబంధించిన హక్కులు ప్రశ్నార్థకంగా మారాయి. తాజాగా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో రైతులు తమ వ్యవసాయ భూములను అధికారులు అన్యాయంగా 22A (నిషేధిత జాబితా) కింద చేర్చారంటూ ఆందోళనకు దిగారు. సొంత భూములను రిజిస్ట్రేషన్ కాకుండా, దరిదాపుల్లో ఎలాంటి లావాదేవీలు జరగకుండా నిషేధిత జాబితాలో చేర్చారంటూ వాపోయారు.
వివరాల్లోకి వెళ్తే.. చొప్పదండి మండలంలోని పలు గ్రామాల్లో భారీసంఖ్యలో రైతుల భూములు ఈ నిషేధిత జాబితాలో చేరాయి. గుమ్లాపూర్ గ్రామంలో అత్యధికంగా 428మంది రైతుల భూములు 22A పరిధిలోకి వెళ్లగా, చాకుంటలో 146మంది, రాగంపేటలో 154 మంది, చిట్యాలపల్లి గ్రామంలో 120మంది రైతుల భూములను అధికారులు నిషేధిత జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. తరతరాలుగా తాము హక్కు కలిగి ఉన్న పట్టా భూములను ఒక్కసారిగా నిషేధిత జాబితాలో చేర్చడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యపై రెవెన్యూ, ఇతర ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు అందించినా ఫలితం లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. అధికారులు స్పందించకపోవడంతో పనులన్నీ వదిలేసి రోజూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భూముల సమస్యను త్వరగా పరిష్కారం కాకపోతే అత్యవసర సమయాల్లో రుణాలు పొందేందుకు, లేదా అమ్మకాలు జరుపుకునేందుకు అవకాశం లేకుండా పోతోందని ఆందోళన చెందుతున్నారు.
తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది, వెంటనే తమ భూములను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించాలని చొప్పదండి మండల రైతులు ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే, రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.












