తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ల మధ్య అత్యుత్తమ పరిపాలనా, రాజకీయ సమన్వయం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ విజన్, పార్టీ నిర్మాణం ఒకే దిశలో వేగంగా పయనిస్తున్నాయని వెల్లడించారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో వీరిద్దరి సమర్థవంతమైన నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మళ్లీ ఘన విజయం సాధించి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన తీవ్ర ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బుధవారం మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన ఈ కామెంట్స్ చేశారు. అసెంబ్లీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు. ప్రజా సమస్యలపై శాసనసభ వేదికగా బీఆర్‌ఎస్ నేతలు అర్ధవంతమైన చర్చలు జరపాలని తాము భావించామని, అయితే సభకు ముఖం చాటేసే కుట్రపూరిత వ్యూహంతోనే కావాలని గందరగోళం సృష్టించి సస్పెన్షన్‌కు గురయ్యారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నాయకులకు ప్రజాస్వామ్య నియమావళి, సభ పద్ధతులపై గౌరవం లేదని, ప్రజాసమస్యలను పట్టించుకోకుండా పారిపోతున్నారని తీవ్రంగా విమర్శించారు.
తమ పదేళ్ల పాలనలో అసెంబ్లీని అతి తక్కువ రోజులు నడిపిన చరిత్ర బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా, సుదీర్ఘంగా సభను నిర్వహిస్తుంటే తట్టుకోలేక ప్రతిపక్షాలు సభనుంచి పారిపోతున్నాయని దుయ్యబట్టారు. కేవలం వార్తల్లో నిలిచేందుకే స్పీకర్ స్థానాన్ని అవమానిస్తూ, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు ప్రజాస్వామ్య వ్యవస్థల తీవ్ర ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.
రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా తమ ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని, ప్రతిపక్షాల అడ్డంకులను ఎదుర్కొంటూ ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు, పార్టీ బలోపేతం సమాంతరంగా సాగుతున్నాయని, భవిష్యత్తులో కూడా ఇదే జోరుతో ప్రజల ఆదరాభిమానాలు పొందుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ కాంగ్రెస్ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.












