హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్‌షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ఆయన సభ్యత్వం రద్దు అవుతుందని జోరుగా ప్రచారం నడుస్తున్న వేళ ఎథిక్స్ కమిటీ ఆయనకు షాక్ ఇచ్చింది. గత అసెంబ్లీ సమావేశాల్లో ఆయన సభలో ప్రవర్తించిన తీరు, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు, అసభ్యకర సైగలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కమిటీ.. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించింది.
సభా నిబంధనలను, శాసనసభ మర్యాదలను ఉల్లంఘించారన్న అభియోగాలపై విచారణ జరిపిన ఎథిక్స్ కమిటీ, హుజూరాబాద్ ఎమ్మెల్యే ప్రవర్తన సభ గౌరవాన్ని కించపరిచేలా ఉందని నిర్ధారణకు వచ్చింది. ఈ మేరకు వచ్చే శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేలోపే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. దీంతో అసెంబ్లీ నిబంధనావళి ప్రకారం ఆయనపై వేటు పడేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం.
సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఎథిక్స్ కమిటీ నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో సస్పెన్షన్‌తో సహా మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.కేవలం సస్పెన్షన్‌తో సరిపెడతారా? లేక సభ్యత్వం రద్దు చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆయన ఎమ్మెల్యే పదవి రద్దు అయితే బీఆర్ఎస్ పార్టీకి బిగ్‌షాక్ తప్పదు.
ప్రస్తుతం అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ నివేదికకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలపగా.. సభలో అడ్డుచెప్పడానికి బీఆర్ఎస్ సభ్యులు ఎవరూ లేరు. ఎందుకంటే వారిని ఈ సెషన్స్ మొత్తం స్పీకర్ గడ్డం ప్రసాద్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఎథిక్స్ కమిటీ ఇప్పటికే కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇవ్వగా.. సమాధానం ఇవ్వడానికి ఆయన కాస్త సమయం కోరినట్టు తెలిసింది. పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చే సమాధానంతో ఎథిక్స్ కమిటీ సంతృప్తి చెందుతుందా? లేదా?అనేది తెలియాల్సి ఉంది.












