అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రపంచదేశాలకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్‌ను భారీగా దిగుమతి చేసుకుంటున్న ఇండియా సహా 5 ప్రధాన దేశాల నుంచి వచ్చే వస్తువులపై ఏకంగా 100 శాతం వరకు దిగుమతి సుంకాలను విధించేందుకు సిద్ధమయ్యారు. దానికి వీలు కల్పించే ఆంక్షల బిల్లును అమెరికా ప్రతినిధుల సభలో తుది ఓటింగ్‌కు సిద్ధం చేశారు.
రష్యా,ఇరాన్‌లపై ఆర్థిక ఒత్తిడిని తీవ్రతరం చేసేలా రూపొందించిన ‘లిండ్సే గ్రాహం సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’ బిల్లుకు ఇప్పటికే సెనేట్ ఆమోదం తెలపగా.. తాజాగా ప్రతినిధుల సభలో రూల్స్ కమిటీ పరిశీలన తర్వాత తుది ఆమోద ప్రక్రియకు మార్గం సుగమం అయ్యింది. ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలో రష్యా.. ఇంధనాన్ని ఎగుమతి చేసి భారీగా నిధులు సమకూర్చుకుంటోంది. రష్యా నుంచి భారత్ భారీగా ముడిచమురును దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే రష్యాకు వెళ్లే నిధుల ప్రవాహాన్ని అడ్డుకోవడమే ధ్యేయంగా తెచ్చిన ద్వైపాక్షిక బిల్లు ప్రతినిధుల సభలోనూ సులభంగా నెగ్గే అవకాశముందని అమెరికా పొలిటికల్ వర్గాలు అంచనా వేశాయి. ఈ చట్టం అమల్లోకి వస్తే రష్యా నుంచి గరిష్ట పరిమాణంలో చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాల ఉత్పత్తులపై సెకండరీ టారిఫ్‌లు విధించే ప్రత్యేక కార్యనిర్వాహక అధికారం అమెరికా ప్రభుత్వానికి దక్కనుంది.
ఫలితంగా ఇండియాలో ఫార్మా, టెక్స్‌టైల్స్, ఇంజినీరింగ్ ఎగుమతి రంగాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదముందని ట్రేడ్ అనలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, దేశ ఇంధన భద్రత, ఆర్థిక ప్రయోజనాల కోసమే తాము మార్కెట్ నిబంధనల ప్రకారం చమురును దిగుమతి చేసుకుంటున్నామని, అంతర్జాతీయ నిబంధనలను పాటిస్తున్నామని భారత ప్రభుత్వం గతంలోనే తెలిపింది.ఈ చట్టం అమల్లోకి అమెరికా, ఇండియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు, వ్యూహాత్మక బంధంపై ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో అని ఆందోళన నెలకొంది.








