తెలంగాణ

22A నిషేధిత భూముల పరిష్కారానికి మరో కమిటీ.. అసెంబ్లీ వేదికగా నేడు ప్రకటన!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

తెలంగాణలో తీవ్ర వివాదాస్పదంగా మారిన 22A (నిషేధిత జాబితా) భూముల పరిష్కారంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా జిల్లా స్థాయి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది.

 తెలంగాణలో తీవ్ర వివాదాస్పదంగా మారిన 22A (నిషేధిత జాబితా) భూముల పరిష్కారంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా జిల్లా స్థాయి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. అదేవిధంగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసైన్డ్ భూముల చిక్కుముడులను విప్పేందుకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA) ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించి, సదరు కమిటీ నుంచి 30 రోజుల్లో సమగ్ర నివేదిక తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

 నిన్న(మంగళవారం) జరిగిన క్యాబినెట్ మంత్రుల ఉన్నత స్థాయి సమావేశంలో ఈ భూముల వర్గీకరణ, నిషేధిత జాబితా నుంచి తొలగింపు, అప్పీళ్ల ప్రక్రియపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. భూ యజమానులు, రైతులు ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకే ఈ చర్యలని ప్రభుత్వం చెబుతుండగా, నేడు ప్రారంభం కానున్న శాసనసభ (అసెంబ్లీ) సమావేశాల వేదికగా ఈ నూతన కమిటీల ఏర్పాటు మరియు దానికి సంబంధించిన నిబంధనలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

 అయితే, ప్రభుత్వ చర్యలపై బాధితుల నుంచి, ప్రతిపక్షాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 22A భూముల సమస్య పరిష్కారం పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం కమిటీల మీదే కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తోందని బాధితులు, రైతు సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు నివేదికలు, అర్జీలు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. సమస్యను వెంటనే కొలిక్కి తీసుకురాకుండా మళ్లీ కమిటీల జపం చేయడం వల్ల భూ యజమానులకు నిరీక్షణ తప్పడం లేదని మండిపడుతున్నారు.

 జిల్లా స్థాయి కమిటీలకు అధికారాలు కట్టబెట్టడం ద్వారా క్షేత్రస్థాయిలోనే అర్హులైన బాధితులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. 30 రోజుల గడువుతో సీసీఎల్‌ఏ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందా? లేదా ఇది కూడా కాలయాపనకే పరిమితమవుతుందా అనేది వేచి చూడాల్సి ఉంది. నేడు అసెంబ్లీలో ప్రభుత్వం చేసే ప్రకటనపైనే భూ బాధితుల దృష్టి నిలిచింది.

 

#Section22A#RevenueDepartment#TelanganaNews#PrajaPalana#TelanganaAssembly#LandIssues#CCLA#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి