సౌదీ అరేబియాలోని అత్యంత పవిత్రమైన మక్కా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన డ్రోన్‌ను సౌదీ నేతృత్వంలోని కూటమి బలగాలు విజయవంతంగా అడ్డుకుని నాశనం చేశాయి. మంగళవారం సాయంత్రం మక్కా ఆకాశంలోకి ప్రవేశించే ముందే సౌదీ అరేబియా రాయల్ ఎయిర్ డిఫెన్స్ ఫోర్స్ ఈ డ్రోన్‌ను గాలిలోనే పేల్చివేసింది. ఈ దాడి యత్నం మక్కా నగర భద్రతకు తీవ్ర ముప్పు కలిగించేలా ఉందంటూ సౌదీ నేతృత్వంలోని కూటమి ప్రతినిధి తుర్కి అల్-మాలికీ తీవ్రంగా ఖండించారు.
మక్కా, ఇతర ఇస్లామిక్ పవిత్ర స్థలాల భద్రత తమకు రెడ్ లైన్ Red Line) అని, సందర్శకులను భయభ్రాంతులకు గురిచేసే చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని తుర్కి అల్-మాలికీ హెచ్చరించారు. దాడి యత్నం నేపథ్యంతో మక్కా, తైఫ్, జెద్దా నగరాల్లో తక్షణ సెక్యూరిటీ అలర్ట్ జారీ చేయగా, ప్రమాదం తప్పినట్లు నిర్ధారించుకున్న వెంటనే అలర్ట్‌ను ఉపసంహరించారు. 2017లో హౌతీలు మక్కాను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేసిన తర్వాత నగరంలో ఇలాంటి భద్రతా హెచ్చరిక జారీ కావడం మళ్లీ ఇదే తొలిసారి.
కాగా, ఈ ఆరోపణలను హౌతీ బలగాలు ఖండించాయి. మక్కా నగరానికి లేదా ఇతర పవిత్ర స్థలాలకు తమ నుంచి ఎలాంటి ముప్పు లేదని, తాము మక్కాను లక్ష్యంగా చేసుకోలేదని హౌతీ సైనిక ప్రతినిధులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. 2015లో యెమెన్ యుద్ధంలో సౌదీ ప్రవేశించినప్పటి నుంచి ఇరువర్గాల మధ్య ఘర్షణలు సాగుతున్నాయి. జూలైలో సౌదీ షిప్పింగ్‌పై ఆంక్షలు, సెప్టెంబర్ ప్రారంభంలో సౌదీలోని పలు ప్రాంతాలపై హౌతీల మిస్సైళ్లు, డ్రోన్ దాడులతో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ముస్లింలు ప్రార్థించే అత్యంత పవిత్రమైన కాబా క్షేత్రం ఉన్న మక్కా నగరం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఈ ఏడాదే సుమారు 17లక్షల మంది హజ్ యాత్రికులను, 11.7 మిలియన్ల మంది ఉమ్రా పర్యాటకులను సౌదీ ఆహ్వానించింది. సుదీర్ఘ కాలం తర్వాత పవిత్ర నగర సమీపంలో చోటుచేసుకున్న ఈ దాడులు భవిష్యత్తులో హజ్, ఉమ్రా పర్యాటకుల రాకపోకలపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనన్న ఆందోళన అంతర్జాతీయంగా వ్యక్తమవుతోంది.












