National

కాంగ్రెస్‌లో రాహుల్ కొత్త టీమ్ గేమ్! ఇప్పటి నుంచే గ్రౌండ్‌లోకి దిగుతున్నారా?

రచన: Kashi11 నిమిషాల పఠనం

ఇప్పటి వరకు కాంగ్రెస్‌లో ఒక సమస్య తరచూ కనిపించింది. ఎన్నికల సమయంలో ఒక్కసారిగా యాక్టివేట్‌ అయ్యే నాయకత్వం.. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ ఢిల్లీ కేంద్రంగా మారిపోవడం. రాహుల్‌ గాంధీ ఇప్పుడు ఆ పద్ధతిని మార్చాలనుకుంటున్నారా?

మిషన్ 2029 దిశగా కాంగ్రెస్ అడుగులు

కొత్త టీమ్ పై రాహుల్ ఫోకస్

జాతీయ కార్యదర్శులతో సమావేశం

రాష్ట్రాల్లో పర్యటించాలని ఆదేశం

2029 లోక్‌సభ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. కానీ కాంగ్రెస్‌లో మాత్రం అప్పుడే ఎన్నికల కసరత్తు మొదలైపోయిందా? పార్టీని నడిపించే నాయకుల కంటే.. రాష్ట్రాల్లో పార్టీని నడిపించే ఆర్గనైజేషన్‌ టీమ్‌పై రాహుల్‌ గాంధీ ఫోకస్ పెట్టడం ఇప్పుడు కాంగ్రెస్‌లో కొత్త చర్చకు కారణమవుతోంది. జాతీయ కార్యదర్శుల పనితీరును నేరుగా తెలుసుకోవడం.. వాళ్లు రాష్ట్రాల్లో ఎంత సమయం గడుపుతున్నారు అని ఆరా తీయడం.. కొత్త బాధ్యతలు ఎవరికి ఇవ్వాలి అనే దానిపై కసరత్తు చేయడం.. ఇవన్నీ కలిపి చూస్తే కాంగ్రెస్‌ 2029 కోసం ఇప్పటి నుంచే తన సంస్థాగత యంత్రాంగాన్ని మార్చుకుంటోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఢిల్లీలో కూర్చుంటే కుదరదు.. రాష్ట్రాల్లోకి వెళ్లాల్సిందే!

రాహుల్‌ గాంధీ తాజాగా కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శులతో సమావేశమై.. వాళ్ల పని తీరు, రాష్ట్రాల పర్యటనలు, ఎదురవుతున్న సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యదర్శుల పనితీరును అంచనా వేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ నాయకులు ఢిల్లీలో కూర్చొని వ్యవహారాలు నడపడం కంటే.. తమకు కేటాయించిన రాష్ట్రాల్లోనే ఎక్కువ సమయం గడపాలని రాహుల్‌ గాంధీ స్పష్టం చేసినట్లు సమాచారం. నెలలో కనీసం 15 రోజులు రాష్ట్రాల్లో పర్యటించి.. కేడర్‌తో, ప్రజలతో, స్థానిక నాయకులతో నేరుగా మాట్లాడాలన్న దిశగా పార్టీ ఫోకస్ పెట్టింది.

ఇది చిన్న మార్పు కాదు. ఎందుకంటే ఎన్నికల సమయంలో మాత్రమే రాష్ట్రాలకు వెళ్లే నేతలతో కాకుండా.. ఏడాది పొడవునా పార్టీని నడిపించే వ్యవస్థను తయారు చేయాలన్న ఆలోచన ఇందులో కనిపిస్తోంది.

56 మంది సెక్రటరీలు.. ఎవరి పనితీరు ఎలా?

కాంగ్రెస్‌ సంస్థాగత మార్పుల్లో ఇప్పటికే జనరల్‌ సెక్రటరీలు, రాష్ట్రాల ఇన్‌చార్జ్‌ల స్థాయిలో మార్పులు జరిగాయి. ఇప్పుడు తదుపరి దశలో జనరల్‌ సెక్రటరీల కింద పనిచేసే సెక్రటరీల బాధ్యతలు, పనితీరుపై ఫోకస్‌ పెరిగింది. ఈ క్రమంలోనే రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్‌ కలిసి కొత్త నాయకులను ఎంపిక చేసే ప్రక్రియలోనూ చురుగ్గా వ్యవహరించారు. దాదాపు 150 మంది ఆశావహులను పరిశీలించిన తర్వాత కొత్త జాతీయ కార్యదర్శుల ఎంపికపై కసరత్తు జరిగినట్లు సమాచారం.

అంటే కాంగ్రెస్‌లో ఇక కేవలం సీనియారిటీ ఆధారంగా పదవులు ఇవ్వడం కంటే.. ఎవరు ఎంత పని చేస్తున్నారు? ఎవరు రాష్ట్రాల్లో తిరుగుతున్నారు? ఎవరు కేడర్‌ను యాక్టివేట్ చేయగలుగుతున్నారు? ఎవరు ఎన్నికల సమయంలో పార్టీకి ఉపయోగపడగలుగుతున్నారు? అనే అంశాలు కూడా కీలకం కానున్నాయి.

సెక్రటరీల్లో అసంతృప్తి ఎందుకు?

ఇక్కడే కాంగ్రెస్‌ కథ మరో మలుపు తీసుకుంటోంది. కొంతమంది సెక్రటరీలు తమకు సరైన బాధ్యతలు ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ఇన్‌చార్జ్‌లు, పరిశీలకులకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటోందని.. సెక్రటరీల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకునే వ్యవస్థ బలంగా లేదని కొందరు అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా సంస్థాగత పునర్‌వ్యవస్థీకరణలో తమ పాత్ర పరిమితంగా ఉందని కొందరు నాయకులు చెప్పినట్లు సమాచారం. అయితే దీనిపై రాహుల్‌కు సన్నిహితంగా ఉన్న ఒక నాయకుడు భిన్నంగా స్పందించారు. అవకాశం అనేది ప్రతి నాయకుడి సామర్థ్యం, పనితీరుపై ఆధారపడి ఉంటుందని.. సంస్థలో చాలా కాలం పనిచేసిన వారికి మాత్రమే పెద్ద బాధ్యతలు రావడం సహజమని ఆయన వాదించారు.

అంటే కాంగ్రెస్‌లో సమస్య కేవలం నాయకులకు బాధ్యతలు ఇవ్వడమా? లేక బాధ్యత ఇచ్చిన తర్వాత దాన్ని కొలిచే వ్యవస్థను కూడా బలపరచడమా? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

పంజాబ్‌ నుంచి గుజరాత్‌ వరకు.. ముందే పరీక్షలు!

ఇటీవల కాంగ్రెస్‌ చేసిన మార్పులను కూడా ఇదే కోణంలో చూడాల్సి ఉంటుంది. ఎన్నికలు జరగబోయే పంజాబ్‌లో భూపేష్‌ బఘేల్‌ స్థానంలో సచిన్‌ పైలట్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించారు. బఘేల్‌ను అసోంకు పంపారు. అలాగే రణదీప్‌ సూర్జేవాలాకు గుజరాత్‌ అదనపు బాధ్యతలు ఇచ్చారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సరైన నాయకులను సరైన రాష్ట్రాల్లో పరీక్షించే ప్రయత్నంగా ఈ మార్పులను చూస్తున్నారు.

అంటే కాంగ్రెస్‌ దగ్గర ఇప్పుడు ఒక కొత్త లెక్క కనిపిస్తోంది. ఎన్నికలు వచ్చే ఏడాది ఉంటే.. ఆ ఎన్నికల కోసం ఏడాది ముందే నాయకుడిని పంపాలి. రాష్ట్రంలో సమస్యలు ఉంటే.. ఎన్నికలకు ఆరు నెలల ముందు కాదు, ఇప్పటి నుంచే పరిష్కరించాలి. కేడర్‌ బలహీనంగా ఉంటే.. పోలింగ్‌కు ముందు కాదు, ఇప్పటి నుంచే బలోపేతం చేయాలి.

అసలు టార్గెట్‌ 2027 కాదు.. 2029?

ఇక్కడే ఈ మొత్తం కసరత్తుకు అసలు అర్థం కనిపిస్తుంది. పంజాబ్‌ వంటి రాష్ట్రాల్లో 2027లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో 2028లో ఎన్నికలు వస్తాయి. ఇవన్నీ కాంగ్రెస్‌కు చిన్న చిన్న పరీక్షలు. కానీ ఆ పరీక్షల నుంచి బయటపడే నాయకత్వం, ఆర్గనైజేషనల్‌ మోడల్‌నే 2029 లోక్‌సభ ఎన్నికల్లో ఉపయోగించాలన్నది హైకమాండ్‌ ఆలోచనగా కనిపిస్తోంది.

ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్‌ వంటి కీలక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ తన స్వంత సంస్థాగత బలాన్ని పెంచుకోవడంపై దృష్టి పెడుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకున్న పరిస్థితిని 2029 వరకు నిలబెట్టుకోవాలంటే.. మిత్రపక్షాలపై మాత్రమే ఆధారపడకుండా స్వంత కేడర్‌, బూత్‌ స్థాయి నిర్మాణం బలంగా ఉండాలని పార్టీ భావిస్తోంది.

అందుకే ఇప్పుడు రాహుల్‌ గాంధీ ఫోకస్‌ కేవలం పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించడంపైనే కాకుండా.. పార్టీని కింద నుంచి పైకి ఎలా నిర్మించాలన్న దానిపైనా పడినట్లు కనిపిస్తోంది.

రాహుల్‌ కొత్త లెక్క ఇదేనా?

ఇప్పటి వరకు కాంగ్రెస్‌లో ఒక సమస్య తరచూ కనిపించింది. ఎన్నికల సమయంలో ఒక్కసారిగా యాక్టివేట్‌ అయ్యే నాయకత్వం.. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ ఢిల్లీ కేంద్రంగా మారిపోవడం. రాహుల్‌ గాంధీ ఇప్పుడు ఆ పద్ధతిని మార్చాలనుకుంటున్నారా? రాష్ట్రానికి ఒక ఇన్‌చార్జ్‌.. అతని కింద సెక్రటరీ.. జిల్లా స్థాయిలో అధ్యక్షులు.. ఆ తర్వాత బూత్‌ స్థాయిలో కేడర్‌.. ఇలా ఒక నిరంతర వ్యవస్థను తయారు చేయాలనుకుంటున్నారా? అనే చర్చ మొదలైంది.

ఇప్పటికే కాంగ్రెస్‌ కొత్త జిల్లా అధ్యక్షుల విషయంలో కూడా పనితీరుకు ప్రాధాన్యం ఇస్తోంది. పార్టీ పదవి అనేది కేవలం హోదా కాదని.. రూట్ లెవల్ లో పని చేసి ఫలితం చూపించాల్సిన బాధ్యత అని రాహుల్‌ గాంధీ గతంలో స్పష్టం చేశారు. అందుకే జాతీయ కార్యదర్శులపై ఇప్పుడు పడుతున్న ఫోకస్‌ కూడా అదే మోడల్‌లో భాగంగా కనిపిస్తోంది.

కాంగ్రెస్‌ ముందున్న అసలు సవాల్‌ ఏంటి?

కొత్త నాయకులను తీసుకురావడం ఒక ఎత్తు.. వాళ్లకు నిజమైన అధికారాలు ఇవ్వడం మరో ఎత్తు. రాష్ట్రాల్లో పని చేయమని చెప్పడం ఒక ఎత్తు.. వాళ్లు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ను నిర్ణయాల్లో పరిగణనలోకి తీసుకోవడం మరో ఎత్తు. కాంగ్రెస్‌ నిజంగా 2029 కోసం కొత్త సంస్థాగత మోడల్‌ తయారు చేయాలంటే.. ఢిల్లీలో నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాలకు పంపించడం మాత్రమే సరిపోదు. రాష్ట్రాల నుంచి వచ్చే సమాచారం మళ్లీ ఢిల్లీ నిర్ణయాలను ప్రభావితం చేసే విధంగా వ్యవస్థ ఉండాలి.

అందుకే ఇప్పుడు జరుగుతున్న రీషఫుల్‌ను కేవలం కొంతమంది నాయకులకు పదవులు ఇవ్వడం, కొంతమందిని మార్చడం అనే కోణంలో చూడటం కంటే.. కాంగ్రెస్‌ తన ఎన్నికల యంత్రాంగాన్ని రీబిల్డ్‌ చేస్తోందా? అనే కోణంలో చూడాల్సి ఉంటుంది.

2027, 2028 ఎన్నికలు కాంగ్రెస్‌కు ప్రాక్టీస్‌ గ్రౌండ్‌ అయితే.. 2029 అసలు పరీక్ష. ఆ పరీక్షకు ముందు రాహుల్‌ గాంధీ ఇప్పుడు చేయాలనుకుంటున్నది ఒక్కటే కావచ్చు. అదే.. ఢిల్లీలో కూర్చున్న కాంగ్రెస్‌ను.. రాష్ట్రాల్లో తిరిగే పార్టీగా మార్చడం.

#Rahul Gandhi#Congress#Mission 2029#Congress Strategy#2029 Lok Sabha Elections#Priyanka Gandhi#Indian National Congress#Congress Reshuffle#Congress Organisation#Congress News#Indian Politics#Lok Sabha Elections#Political Analysis#Congress Leaders#Rahul Gandhi News#India Politics#Congress 2029#Election Strategy
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి