Mahesh Kumar Goud: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టాఫ్ తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. అధికారం పోయినా అహంకారం పోలేదా అంటూ బీఆర్ఎస్ నేతలపై ఆయన ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలతో పాటు కేటీఆర్ స్టాఫ్ సైతం రెచ్చిపోయారని ధ్వజమెత్తారు. విధుల్లో ఉన్న పోలీసులతో కేటీఆర్ సిబ్బంది వ్యవహరించిన తీరుకు సంబంధించి మహేశ్ కుమార్ గౌడ్ ఒక వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. కేటీఆర్ స్టాఫ్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం, వారిని రాయలేని భాషలో బూతులు తిట్టడం అందులో ఉంది. దీనిపై మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు.
విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై కేటీఆర్ పీఆర్ఓ మహేష్, పీఏ మహేందర్ రెడ్డి ప్రదర్శించిన దురుసు ప్రవర్తన యావత్ పోలీసు వ్యవస్థ ఆత్మగౌరవాన్ని ప్రశ్నార్థకం చేసేలా ఉందని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ప్రజల ప్రాణాలను, రక్షణను కాపాడే ఖాకీ చొక్కాను రాజకీయ అహంకారంతో అవమానించడం సరికాదని హితవు పలికారు. ఆ ఖాకీ వెనుక ఒక వ్యవస్థ, ఒక బాధ్యత, ప్రజల నమ్మకం ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
నిన్న అధికారాన్ని అడ్డు పెట్టుకుని పెత్తనం చెలాయించారు.. నేడు అధికారం లేకపోయినా అదే అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు అంటూ బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. మారినవి కుర్చీలు మాత్రమే, మీ తీరు మాత్రం మారలేదని విమర్శించారు.
పోలీసులు మీ రాజకీయ అనుచరులు కారు.. మీ ఆదేశాలకు తలవంచే వ్యక్తులు అంతకన్నా కాదని బీఆర్ఎస్ నాయకులకు, కేటీఆర్ సిబ్బందికి మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పోలీసులు చట్టానికి కట్టుబడి ప్రజల రక్షణ కోసం పనిచేసే బాధ్యతాయుతమైన అధికారులు అని అన్నారు. ఖాకీ చొక్కాను అవమానించినంత మాత్రాన దాని గౌరవం ఎప్పటికీ తగ్గదన్నారు. కానీ, అలా ప్రవర్తించిన వారి అసలు సంస్కారం ఏమిటో సమాజం ముందు బట్టబయలవుతుందన్నారు.
అధికారం శాశ్వతం కాదు.. కానీ మీ అహంకారం చరిత్రలో నిలిచిపోతుంది.. అంటూ బీఆర్ఎస్ నేతలపై మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. కేటీఆర్ స్టాఫ్.. డ్యూటీలో ఉన్న పోలీసులతో వ్యవహరించిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.
అసెంబ్లీ గేట్ దగ్గర జరిగిన ఘటనను ప్రభుత్వం, పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేశారు. అటు పోలీసులతో వాగ్వాదానికి దిగారన్న ఆరోపణలపై కేటీఆర్ పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ రెడ్డిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ దగ్గర విధుల్లో ఉన్న పోలీసు అధికారుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు వారితో దురుసుగా ప్రవర్తించి బూతులు తిట్టారని ఈ కేసు నమోదైంది.








