హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.. నగరంలోకి వచ్చే దూరప్రాంత బస్సుల రాకపోకలను క్రమబద్ధీకరించడంతో పాటు ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థను అందించేందుకు నాలుగు కొత్త బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ప్రణాళికకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోకి వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో బస్సులు ప్రవేశిస్తున్నాయి. నగరంలోని ప్రధాన ప్రాంతాల వరకు వచ్చి తిరిగి వెళ్లాల్సి రావడంతో సిటీ లో ట్రాఫిక్ పెరుగుతోంది. దీనికి పరిష్కారంగా నగరానికి నలువైపులా బస్సులను నియంత్రించేలా కొత్త టెర్మినల్స్‌ను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన.
ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర వైపు వెళ్లే బస్సుల కోసం సుమారు వంద ఎకరాల్లో భారీ ఇంటర్నేషనల్ బస్ టెర్మినల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రత్యేక టెర్మినల్ నిర్మించే ప్రణాళిక ఉంది. ఎల్బీనగర్ పరిధిలో తూర్పు, దక్షిణ ప్రాంతాల ప్రయాణికులకు అనువుగా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఘట్‌కేసర్ వద్ద కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బస్సుల రాకపోకలను నియంత్రించేలా టెర్మినల్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ప్రాజెక్టులో టెర్మినల్స్ నిర్మాణంతో పాటు బస్సుల రూట్లను సైతం పూర్తిగా పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు వైపు నుంచి వచ్చే దూరప్రాంత సర్వీసులను నగరంలోని లోపలి ప్రాంతాలకు అనుమతించకుండా ఆయా దిశల్లోని టెర్మినల్స్ వరకు మాత్రమే నడిపించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
దీంతో నగర నడిబొడ్డుకు చేరకముందే బస్సుల రాకపోకలను నియంత్రించవచ్చు. ప్రయాణికులు అక్కడి నుంచి సిటీ ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు, ఎంఎంటీఎస్ ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా లాస్ట్ మైల్ కనెక్టివిటీని బలోపేతం చేయనున్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నగర రహదారులపై భారీ వాహనాల ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటే.. మరోవైపు ప్రయాణికులకు ప్రాంతాల వారీగా మెరుగైన కనెక్టివిటీ అందుబాటులోకి రావచ్చు. ప్రణాళిక సక్రమంగా అమలైతే హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్లే కీలక ప్రాజెక్టుగా ఈ నాలుగు టెర్మినల్స్ నిలిచే అవకాశం ఉంటుంది.







