హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మరో భూవివాదం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. నానక్‌రామ్‌గూడలోని ప్రతిష్టాత్మక మంత్రీ కాస్మోస్ ప్రాంగణం చుట్టూ తలెత్తిన వివాదం.. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఈ వ్యవహారంలో సినీ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు మురళీధర్ రెడ్డి, గడ్డం రవి తదితరుల పేర్లు ఫిర్యాదులో ప్రస్తావనకు రావడం మరింత ఆసక్తిని రేపుతోంది.
మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధి పెద్దిరాజు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఉదయం సుమారు 8 గంటల 40 నిమిషాల సమయంలో కొందరు వ్యక్తులు మంత్రీ కాస్మోస్ సౌత్‌వెస్ట్ కార్నర్ గేట్ వద్దకు వచ్చారు. గేట్ తాళాలు పగులగొట్టి ప్రాంగణంలోకి ప్రవేశించడంతో పాటు.. అక్కడ ఉన్న కొన్ని నిర్మాణాలను ధ్వంసం చేసి టిన్‌షీట్లు ఏర్పాటు చేసినట్లు ఆరోపించారు. అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందిని తోసివేసి బెదిరింపులకు పాల్పడ్డారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ మొత్తం వ్యవహారం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిందని అసోసియేషన్ చెబుతోంది. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్, ఫొటోలను పెన్‌డ్రైవ్‌లో గచ్చిబౌలి పోలీసులకు అందజేసినట్లు తెలిపింది. మరోవైపు మంత్రీ కాస్మోస్ ఉన్న ప్రాంతం సాధారణ కమర్షియల్ ప్రదేశం మాత్రమే కాదు. సర్వే నంబర్ 130 పరిధిలోని ఈ ప్రాజెక్టు IT/ITES స్పెషల్ ఎకనమిక్ జోన్‌లో భాగంగా ఉన్నట్లు అధికారిక SEZ రికార్డులు చూపిస్తున్నాయి.
ఈ ప్రాంగణంలో పలు ఐటీ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అంతేకాదు.. భవనం దక్షిణ భాగంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, జనరేటర్లు, వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన సదుపాయాలు ఉన్నాయని అసోసియేషన్ చెబుతోంది. సౌత్‌వెస్ట్ మార్గం అత్యవసర పరిస్థితుల్లో ఫైర్ ఇంజిన్లు, నీటి ట్యాంకర్లు వెళ్లేందుకు కీలకమైన మార్గమని పేర్కొంటోంది.
ప్రస్తుతం మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ మాత్రం తమ ప్రాంగణంలోకి అక్రమ ప్రవేశం, ఆక్రమణ ప్రయత్నాలు జరిగాయని ఆరోపిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతోంది. గచ్చిబౌలి పోలీసులతో పాటు డీజీపీ, సైబరాబాద్ కమిషనర్, మాదాపూర్ డీసీపీ, గచ్చిబౌలి ఏసీపీలకు కూడా ఫిర్యాదు ప్రతులు పంపినట్లు వెల్లడించింది. ఇక హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో కోట్ల విలువైన భూముల చుట్టూ కొనసాగుతున్న వివాదాలకు ఈ ఘటన మరో ఉదాహరణగా మారింది.










