ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూశారు. 56 సంవత్సరాల వయసున్న ఆయన, విశాఖపట్నంలోని తన నివాసంలో నేడు తీవ్ర గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, ఫలితం లేకుండా పోయిందని సమాచారం.
ఇక ఆళ్ల నాని పూర్తి పేరు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కేంద్రంగా ఆయన సుదీర్ఘకాలం పాటు తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. విద్యార్థి దశ నుంచే ప్రజాసేవ పట్ల ఆసక్తి చూపిన ఆయన, కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఏలూరు నియోజకవర్గం నుంచి 2004, 2009 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి వరుసగా విజయం అందుకున్నారు.
మరోవైపు ఆళ్ల నాని నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, సౌమ్యుడిగా గుర్తింపు పొందారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో సన్నిహిత సంబంధాలు కలిగిన ఆయన.. తదనంతర పరిణామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 శాసనసభ ఎన్నికల్లో ఏలూరు నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు.
అనంతరం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కేబినెట్‌లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, అలాగే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా కోవిడ్ పాండమిక్ సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలను పర్యవేక్షించడంలో ఆళ్ల నాని కీలక పాత్ర పోషించారు. ఇక 2024 ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన వైఎస్సార్‌సీపీకి గుడ్ బై చెప్పి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.
సౌమ్య స్వభావంతో, వివాదాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆళ్ల నాని ఆకస్మిక మృతి పశ్చిమగోదావరి జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆళ్ల నాని చేసిన సేవలను, రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.









