ఇళ్లు లేని పేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకం కింద మరిన్నిఇళ్లను కేటాయించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు అదనంగా కేటాయింపులు చేసినట్టు సమాచారం. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు 2 కోట్ల ఇళ్లను కేటాయించిన కేంద్రం.. వాటికి అదనంగా మరో 5 లక్షల ఇళ్లను మంజూరు చేసింది.
వీటిలో ఏపీకి 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లను కేటాయించింది. ఈ నిర్ణయంతో రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వేలాది ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలకు సొంతిల్లు నిర్మించుకునే వెసులుబాటు కలగనుంది. త్వరలోనే సంబంధిత జిల్లాల వారీగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తోంది.
అందులో కొంత ప్రజల భాగస్వామ్యం ఉండగా.. మరికొంత ప్రభుత్వం సాయం చేయనుంది.ఇటీవల ఇందిరమ్మ ఇండ్లకోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం మరో 2 లక్షల అదనపు ఇళ్లను కేటాయించినట్టు తెలుస్తోంది. దీనికి తోడు PMAY-U 2.0 కింద కూడా కొన్ని వేల ఇళ్లను మంజూరు చేసినట్టు సమాచారం.
గత బడ్జెట్ సమయం నాటి లెక్కల ప్రకారం తెలంగాణకు మొత్తం 4.5 లక్షల ఇళ్లను (3 లక్షలు గ్రామీణ, 1.3 లక్షలు పట్టణ ప్రాంతాలు)లకు కేంద్రం ఇళ్లను కేటాయించిన విషయం తెలిసిందే. పట్టణ ప్రాంతాల్లో (PMAY-U) గతంలో మంజూరు చేసిన వాటిలో సుమారు 2.24 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయినట్టు తెలిసింది. ఇక ఏపీకి తాజాగా 3 లక్షల అదనపు ఇళ్లను కేంద్రం కేటాయించింది. ఏపీ హౌసింగ్ అధికారిక పోర్టల్ సమాచారం ప్రకారం రాష్ట్రంలో మొత్తం 20.48 లక్షల ఇళ్లు మంజూరు కాగా, అందులో 7.17 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయింది.ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక సహాయంగా ₹1.20 లక్షల నుండి గరిష్టంగా ₹1.75 లక్షల వరకు (మరుగుదొడ్డి నిర్మాణానికి అదనంగా ₹12,000) అందిస్తోంది.
దేశవ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటివరకు సుమారు 3.8 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించినట్టు సమాచారం. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో (PMAY-G) 2.82 కోట్లకు పైగా, పట్టణ ప్రాంతాల్లో (PMAY-U) 1 కోటికి పైగా ఇళ్లు పూర్తయ్యాయి.










