అధికార పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తాజాగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డికి, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేదా గ్యాప్ లేదని టీపీసీసీ అధ్యక్షుడు స్పష్టం చేశారు.మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అంతర్గత వ్యవహారాలు, ఇటీవల నెలకొన్న రాజకీయ పరిణామాలు, ఫిర్యాదు, క్రమశిక్షణ ఉల్లంఘనలపై తీసుకున్న చర్యల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నామని వెల్లడించారు.
ఇక మాజీ మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం బాధాకరమైన విషయం అన్నారు. అలా చేయాల్సింది కాకుండేనని.. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకే ఏఐసీసీ ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. పదవులు, హోదాలు, వ్యక్తుల కంటే ‘పార్టీ క్రమశిక్షణే అత్యంత ప్రధానం. ఏఐసీసీ నిర్దేశించిన హద్దులు, పార్టీ లైన్‌ను ఎవరు దాటినా చర్యలు తప్పవు’ అని ఆయన తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రితో కలసి ప్రజాక్షేమం, కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
అనవసర ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని పీసీసీ చీఫ్ పిలుపునిచ్చారు. పార్టీలో ఏమైనా సమస్యలు ఉంటే అంతర్గత వేదికలపై చర్చించాలి తప్ప, బహిరంగంగా మాట్లాడరాదని, కామెంట్స్ చేయొద్దన్నారు. క్రమశిక్షణ తప్పితే అధిష్టానం ఉపేక్షించబోదని ఆయన స్పష్టంచేశారు.కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతో తెలంగాణలో అధికారంలోకి వచ్చామని టీపీసీసీ చీఫ్ వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తలు కీలక పదవులు పొందారని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని వెల్లడించారు. పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరినీ గుర్తిస్తామన్నారు. పదవులు రాలేదని నిరాశతో మీడియా ముందు ఏది పడితే మాట్లాడకూడదని మరోసారి హెచ్చరించారు.సమస్యలు ఉంటే పార్టీలో చర్చించుకుని ముందుకు వెళ్లాలన్నారు.









