తెలంగాణ

Hyderabad: హైదరాబాద్ వాటర్‌పై సంచలన నివేదిక!!..

రచన: Venu5 నిమిషాల పఠనం

పట్టణ వ్యర్థ నీరు, సీవేజ్ ఇన్ ఫిల్టరేషన్, సెప్టిక్ ట్యాంక్ లీకేజీలు, పరిసర ప్రాంతాల్లో ఎరువుల అధిక వాడకం వల్ల భూగర్భ జలాలు ఇలా తీవ్రంగా విషతుల్యంగా మారుతున్నాయి. ఈ కలుషిత నీటిని వాడటం వల్ల పెద్దల కంటే ముఖ్యంగా పిల్లలే తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్‌.. దినదినాభివృద్ధి చెందుతూ విశ్వనగరంగా తన స్థాయిని మరింత పెంచుకుంటోంది. ఆకాశహర్మ్యాలు, విస్తరిస్తున్న ఐటీ కారిడార్లు, మెరుగవుతున్న రవాణా వ్యవస్థ.. నగర రూపురేఖలను వేగంగా మార్చేస్తున్నాయి. దేశ, విదేశాల నుంచి పెట్టుబడులు, ప్రముఖ సంస్థల రాకతో హైదరాబాద్‌ ఆర్థికంగా మరింత బలపడుతోంది. మౌలిక వసతుల అభివృద్ధితో భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా అడుగులు వేస్తోంది.

ఇలా.. అభివృద్ధి, అవకాశాలు, ఆధునికతకు చిరునామాగా మారుతూ.. విశ్వనగరంగా దూసుకెళ్తోన్న హైదరాబాద్‌.. ప్రపంచంలోనే అగ్రగామి మహా నగరాల్లో 41వ స్థానానికి చేరుకుని, గ్లోబల్ హబ్‌గా వెలుగుందుతుంది.. కానీ నేడు తీవ్ర నీటి సంక్షోభంతో అల్లాడుతోందనే నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి.. ప్రస్తుతం సుమారు కోటి 20 లక్షల జనాభాతో, ఏటా 3% వృద్ధి రేటు నమోదు చేస్తున్న హైదరాబాద్‌లో మౌలిక వసతుల కొరత స్పష్టంగా కనిపిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..

ఒకవైపు వేసవి తీవ్రత, ఎల్ నినో ప్రభావంతో భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటిపోతుంటే, మరోవైపు అందుబాటులో ఉన్న కాసింత నీటిలో కూడా ప్రమాదకరమైన విషపదార్థాలు చేరుతుండటం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఇక 2023లో సేకరించిన నమూనాల ఆధారంగా జరిపిన అధ్యయనాల్లో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగుచూశాయి.

ప్రీ-మాన్సూన్ సమయంలో పరీక్షించిన 44 గ్రౌండ్ వాటర్ శాంపిల్స్‌లో ఏకంగా 36 నమూనాల్లో నైట్రేట్ స్థాయిల పరిమితి 45 ఎంజీ కంటే అత్యధికంగా ఉన్నట్లు తేలింది. వర్షాల తర్వాత 40 శాంపిల్స్ సేకరించి పోస్ట్-మాన్సూన్ పరిస్థితిని పరిశీలించగా, ముఖ్యంగా నగరంలోని సెంట్రల్ మరియు సౌత్-వెస్ట్రన్ ప్రాంతాల్లో నైట్రేట్, ఫ్లోరైడ్ స్థాయిలు అత్యంత ప్రమాదకర స్థాయిలో రికార్డయ్యాయి.

పట్టణ వ్యర్థ నీరు, సీవేజ్ ఇన్ ఫిల్టరేషన్, సెప్టిక్ ట్యాంక్ లీకేజీలు, పరిసర ప్రాంతాల్లో ఎరువుల అధిక వాడకం వల్ల భూగర్భ జలాలు ఇలా తీవ్రంగా విషతుల్యంగా మారుతున్నాయి. ఈ కలుషిత నీటిని వాడటం వల్ల పెద్దల కంటే ముఖ్యంగా పిల్లలే తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నైట్రేట్ ప్రభావం వల్ల చిన్నపిల్లల్లో రక్తంలో ఆక్సిజన్ సరఫరా తగ్గి 'బ్లూ బేబీ సిండ్రోమ్' వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

అలాగే నీటిలో ఫ్లోరైడ్ మోతాదు పెరగడం వల్ల దంతాలు, ఎముకలు దెబ్బతినే ముప్పు పెరగడమే కాకుండా, జన్మజాత లోపాలు కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి శుద్ధి, వ్యర్థాల నిర్వహణ చేపట్టకపోతే విశ్వనగరం తీవ్ర ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కోక తప్పదు. కాబట్టి భూగర్భ జలాలను నేరుగా తాగడానికి ఉపయోగించకపోవడం, నీటిని కాచి వడపోసి వాడటం ప్రస్తుతానికి తక్షణ నివారణోపాయంగా చెబుతున్నారు..

#Hyderabad#ground water#levels#nitrate#fluoride#shocking report#Birth Defects
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి