High Court: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫామ్‌హౌస్ దగ్గర శుద్ధి వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో రేవంత్ సర్కార్ కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. కేవలం నోటీసులు ఇచ్చి దర్యాఫ్తు చేయాలని తేల్చి చెప్పింది.
ఎలా అరెస్ట్ చేస్తారు?
ఏడు సంవత్సరాలలోపు శిక్ష పడే సెక్షన్ల కింద ఉన్న కేసుల్లో నిందితులను ఎలా అరెస్ట్ చేస్తారని కోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో అరెస్ట్ చేయొద్దని స్పష్టంగా ఉన్నా.. వాటిని కాదని ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించరాదని పోలీసులను హెచ్చరించింది. కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద శుద్ధి వ్యవహారంపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
కేసీఆర్ ఫామ్‌హౌస్ దగ్గర దళిత నేతల నిరసన
అసెంబ్లీ స్పీకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద కాంగ్రెస్ దళిత నేతలు, కార్యకర్తలు నిరసన నిర్వహించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన పని వివాదానికి దారితీసింది. నిరసన జరిగిన ప్రాంతాన్ని బీఆర్‌ఎస్ కార్యకర్తలు పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. ఈ ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపింది. బీఆర్ఎస్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
పసుపు నీళ్లతో శుద్ధి చేయడంపై సర్కార్ సీరియస్
దళితులను అవమానించారంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఫిర్యాదుతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. శుద్ధి ఘటనను రేవంత్ సర్కార్ సైతం సీరియస్ గా తీసుకుంది. శుద్ధి ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ ప్రకటించారు. దళితులను అవమానిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్టులు వద్దు.. విచారణ మాత్రమే
ఈ అరెస్టులను సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ వేశారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరిపిన న్యాయస్థానం.. నిందితుల అరెస్ట్ పై పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు ఉండటాన్ని కోర్టు ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుంది. కేవలం నోటీసులు ఇచ్చి విచారణ జరపాలి తప్ప అరెస్ట్ చేయడానికి వీల్లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు ఎందుకు పంపారని పోలీసులను ప్రశ్నించింది. ఈ కేసులో తదుపరి చర్యలు నిబంధనలకు అనుగుణంగా ఉండాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది.










