బ్రేకప్ దిశగా యూకే
ఇంగ్లండ్ కు స్కాట్లాండ్, వేల్స్, నార్త్ ఐర్లాండ్ గుడ్ బై
చీలిక వెనుక ట్రంప్ ఉన్నారా..?
ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యంగా ప్రపంచాన్ని శాసించిన బ్రిటన్.. ఇప్పుడు తనలోని యూనియన్‌ను కాపాడుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోందా? వందల ఏళ్ల క్రితం రాజకీయ, ఆర్థిక, భద్రతా ప్రయోజనాలతో ఒక్కటైన బ్రిటన్‌లో ఇప్పుడు మళ్లీ విడిపోవాలనే స్వరాలు బలపడుతున్నాయి. స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ నుంచి వస్తున్న రాజకీయ డిమాండ్లు.. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐర్లాండ్ ఐక్యతపై చేసిన వ్యాఖ్యలు.. యూకే భవిష్యత్తుపై కొత్త చర్చకు తెరతీశాయి.
అసలు యూకే అంటే ఏంటి?
ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ కలిసి యునైటెడ్ కింగ్‌డమ్‌గా ఏర్పడ్డాయి. అయితే ఈ నాలుగు ప్రాంతాల చరిత్ర, రాజకీయ వ్యవస్థలు ఒకేలా ఉండవు. ఇంగ్లండ్, స్కాట్లాండ్ మొదట ప్రత్యేక రాజ్యాలుగా ఉండగా.. 1603లో ఒకే రాజు కిందకు వచ్చాయి. కానీ పూర్తిగా ఒకటిగా మారింది మాత్రం 1707లో. అప్పట్లో ఇంగ్లండ్, స్కాట్లాండ్ కలిసి గ్రేట్ బ్రిటన్‌గా ఏర్పడ్డాయి. ఆ తర్వాత 1801లో ఐర్లాండ్ కూడా ఈ యూనియన్‌లో చేరడంతో యునైటెడ్ కింగ్‌డమ్ రూపుదిద్దుకుంది. ఐర్లాండ్‌లో ఎక్కువ భాగం తర్వాత యూకే నుంచి బయటకు వెళ్లింది. నార్తర్న్ ఐర్లాండ్ మాత్రం బ్రిటన్‌లోనే కొనసాగింది.
ఇక వేల్స్ విషయానికి వస్తే.. ఇది కూడా గ్రేట్ బ్రిటన్‌లోని ప్రత్యేక దేశమే. ఇంగ్లండ్‌తో రాజకీయంగా చాలా కాలం క్రితమే కలిసిపోయినా.. వెల్ష్ భాష, సంస్కృతి, జాతీయ గుర్తింపు మాత్రం ఇప్పటికీ బలంగానే ఉన్నాయి. అందుకే అక్కడ కూడా లండన్ నుంచి మరిన్ని అధికారాలు కావాలనే డిమాండ్లు ఉన్నాయి. స్కాట్లాండ్ తరహాలో వెంటనే స్వాతంత్ర్యం కోసం ఉద్యమం కనిపించకపోయినా.. యూకే భవిష్యత్తుపై చర్చ పెరిగే కొద్దీ వేల్స్ పాత్ర కూడా కీలకంగా మారుతోంది.
స్కాట్లాండ్ తోనే సమస్య
ఇప్పుడు అసలు సమస్య స్కాట్లాండ్‌తోనే ఎక్కువగా కనిపిస్తోంది. 2014లో జరిగిన స్వాతంత్ర్య రెఫరెండంలో స్కాట్లాండ్ ప్రజలు యూకేలోనే ఉండటానికి ఓటేశారు. కానీ ఆ తర్వాత జరిగిన బ్రెగ్జిట్ పరిణామాలు పరిస్థితిని మార్చాయి. యూకే మొత్తం యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకుంది. కానీ స్కాట్లాండ్‌లో మాత్రం యూరోపియన్ యూనియన్‌లోనే కొనసాగాలనే అభిప్రాయం బలంగా కనిపించింది. దీంతో లండన్ నిర్ణయాలు.. ఎడిన్‌బర్గ్ రాజకీయ ఆకాంక్షల మధ్య దూరం మరింత పెరిగింది.
ఇక నార్తర్న్ ఐర్లాండ్ విషయంలో ప్రశ్న మరింత సున్నితమైనది. అక్కడ ప్రధాన చర్చ స్వతంత్ర దేశంగా మారడంపై కంటే.. యూకేలో కొనసాగాలా? లేక రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌తో కలవాలా? అనే దానిపై ఉంది. 1998 గుడ్ ఫ్రైడే ఒప్పందం ప్రకారం ప్రజల సమ్మతికి కీలక ప్రాధాన్యం ఉంది. భవిష్యత్తులో ఐర్లాండ్ ఐక్యతకు మెజారిటీ మద్దతు ఉందని కనిపిస్తే.. నిబంధనల ప్రకారం బోర్డర్ పోల్స్ ప్రశ్న ముందుకు రావచ్చు.
ట్రంప్ వ్యాఖ్యలతో రచ్చ...
ఇలాంటి సమయంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని పెంచాయి. ఐర్లాండ్ పర్యటనలో ఉన్న ట్రంప్ ఐర్లాండ్ ఒక్కటవ్వడాన్ని తాను చూడాలని కోరుకుంటున్నానని చెప్పారు. అది ఎప్పటికైనా జరుగుతుందని.. ఇప్పుడే జరిగితే మంచిదేనన్నట్టుగా వ్యాఖ్యానించారు. స్కాట్లాండ్ స్వాతంత్ర్యం గురించి మాత్రం ఇప్పుడే మాట్లాడనని చెప్పారు.
అమెరికా–ఐర్లాండ్‌కు ఉన్న చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక సంబంధాలు.. నార్తర్న్ ఐర్లాండ్ శాంతి ప్రక్రియలో అమెరికా పాత్ర.. ట్రంప్‌కు ఐర్లాండ్‌తో ఉన్న వ్యక్తిగత వ్యాపార సంబంధాలు.. ఇవన్నీ ఆయన ఆసక్తికి కారణాలుగా చూడొచ్చు. కానీ ఆయన వ్యాఖ్యలు మాత్రం ఇప్పటికే ఉన్న ఐర్లాండ్ ఐక్యత చర్చకు అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రాధాన్యం తీసుకొచ్చాయి.
భారత్ పై ప్రభావం ఉంటుందా..?
ఇక భారత్ కూడా ఈ పరిణామాలను గమనించాల్సిన అవసరం ఉంది. భారత్, యూకే మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, టెక్నాలజీ, ఉద్యోగాలు వంటి అనేక రంగాల్లో బలమైన సంబంధాలు ఉన్నాయి. బ్రిటన్ భవిష్యత్తులో పెద్ద రాజ్యాంగ మార్పును ఎదుర్కొంటే.. వాణిజ్య నిబంధనలు, పెట్టుబడులు, వీసాలు, భారతీయుల ప్రయోజనాలపై పరోక్ష ప్రభావం ఉండొచ్చు. అయితే ఇది వెంటనే భారత్‌పై పడే ప్రభావం కాదు. యూకే ఎలా మారుతుంది? కొత్త రాజకీయ యూనిట్లు ఎలా ఏర్పడతాయి? వాటి ఆర్థిక విధానాలు ఎలా ఉంటాయి? అనే అంశాలపైనే అసలు ప్రభావం ఆధారపడి ఉంటుంది.
అందుకే ప్రస్తుతం యూకే నిజంగానే మూడు ముక్కలవుతోంది అని చెప్పడం తొందరపాటు. కానీ ఒక విషయం మాత్రం సుస్పష్టం.. వందల ఏళ్లుగా కొనసాగుతున్న బ్రిటిష్ యూనియన్‌పై ప్రశ్నలు గతంలో కంటే బలంగా వినిపిస్తున్నాయి. స్కాట్లాండ్ స్వాతంత్ర్యం.. వేల్స్ స్వయం ప్రతిపత్తి.. నార్తర్న్ ఐర్లాండ్ ఐక్య ఐర్లాండ్ డిమాండ్.. వీటికి ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలు కూడా తోడయ్యాయి.
ఒకప్పుడు ప్రపంచాన్ని పాలించిన బ్రిటన్.. ఇప్పుడు ప్రపంచాన్ని పాలించడమే కాదు, తన యూనియన్‌ను ఎంతకాలం కాపాడుకోగలదన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో ఉంది. యూకే బ్రేకప్ ఇప్పుడే జరగకపోవచ్చు.. కానీ ఆ చర్చ మాత్రం ఇక బ్రిటన్ గడప దాటి ప్రపంచ రాజకీయాల్లోకి వచ్చేసింది.








