రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీయువకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చాలా కాలంగా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి తీపికబురు అందించింది. పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ఫోరెన్సిక్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 2,050 ఖాళీల భర్తీకి ఏపీ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు శ్రీకారం చుట్టింది.
2026 జాబ్ క్యాలెండర్‌లోని మార్గదర్శకాలకు అనుగుణంగా నోటిఫికేషన్లు జారీ చేసింది. పోస్టుల వారీగా చూసుకుంటే 438 ఎస్‌ఐ పోస్టులు ఉండగా.. సివిల్ విభాగంలో 253, ఆర్మ్‌డ్ రిజర్వ్‌లో 116, కమ్యూనికేషన్స్‌లో 50, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో 10, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 9 ఖాళీలు ఉన్నాయి. 1,156 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సైతం నోటిఫికేషన్ విడుదల చేసింది.అందులో సివిల్ కానిస్టేబుల్స్ 542, ఏఆర్ కానిస్టేబుల్స్ 285 పోస్టులు ఉన్నాయి.
పోలీసు అనుబంధ శాఖల వారీగా చూస్తే విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలో 158 ఫైర్‌మెన్ పోస్టులు, జైళ్ల శాఖలో 150 పురుష వార్డెన్, 21 మహిళా వార్డెన్ పోస్టులు భర్తీ చేయనున్నారు. పోలీస్ కమ్యూనికేషన్స్‌లో 200 కానిస్టేబుల్, ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో 198 డ్రైవర్, 15 మెకానిక్ ఉద్యోగాలు ఉన్నాయి. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పరిధిలో బయాలజీ/సెరాలజీలో 20, కెమికల్‌లో 13, ఫిజికల్ విభాగంలో 10 కలిపి మొత్తం 43 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులతో పాటు ఇతర సాంకేతిక ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఈ ఖాళీలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. ప్రారంభ తేదీలు, ప్రిలిమినరీ రాత పరీక్షల షెడ్యూల్‌ను త్వరలోనే బోర్డు అధికారికంగా ప్రకటించనుంది. పూర్తి వివరాలు, అర్హతలు, సిలబస్ కోసం ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక పోర్టల్‌ను పరిశీలించాలని అధికారులు సూచించారు.












