ప్రభుత్వాలు సరిగా పని చేయకుంటే నేరుగా స్పందించని కొందరు ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ప్రభుత్వం వైఫల్యాలను తమ సోషల్ మీడియా వాల్ మీద రాసుకొస్తున్నారు. మరికొందరు అసహనం ఎక్కువై దూషణలు సైతం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు వారి మీద కఠినచర్యలు తీసుకుంటున్నాయి. ఒక వ్యక్తి చేసిన పోస్టును హైడ్ చేయడం అనేది అతని చేతిలోనే ఉంటుంది. లేదా రిమూవ్ చేసే అధికారం సదరు సోషల్ మీడియా సంస్థకు ఉంటుంది.
ఈ క్రమంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న పోస్టులను రిమూవ్ చేయాలని లేదా హైడ్ చేయాలని ఇటీవలి కాలంలో సైబర్ పోలీసులు సదరు సోషల్ మీడియా సంస్థలకు రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. నిజంగానే అవి సమాజానికి, వ్యక్తులకు హానికలిగించేలా, వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉంటే సంస్థలు ఆ పోస్టులను రిమూవ్ చేస్తుంటాయి. అయితే, ఏపీలో పోలీసులు తాజాగా చేసిన ఓ పని ఏకంగా ‘ఎక్స్’ సంస్థనే భయాందోళనకు గురిచేసినట్టు తెలిసింది.

ఆ తర్వాత తేరుకున్న ‘ఎక్స్’ సంస్థ ప్రతినిధులు ఇది ఏపీ పోలీసుల పని అని తెలుసుకుని తమ అధికారిక ఖాతాలో ఓ పోస్టు పెట్టగా అది వైరల్ అవుతోంది. వివరాల్లోకివెళితే..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ లోపాలను సోషల్ మీడియాలో ఎత్తి చూపిన వారి పోస్టులను తొలగించాలని ‘ఎక్స్’ సంస్థకు ఏపీ పోలీసుల రిక్వెస్ట్ పెట్టారు. అయితే,తాము ఏపీ పోలీసులం అని చెప్పకుండా ‘యూఎస్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ (FBI) పేరుతో ఫిర్యాదు చేశారు.
తొలుత నిజంగానే FBI ఫిర్యాదుగానే భావించిన సంస్థ ప్రతినిధులు.. ఆ తర్వాత అది ఏపీ పోలీసుల రిక్వెస్ట్ అని తేల్చారు.గుంటూరు అర్బన్ ఎస్పీ ఆఫీసు ఆఫిషియల్ మెయిల్ నుంచి ఇన్‌స్పెక్టర్ ఏవీ బ్రహ్మం రిక్వెస్ట్ చేసినట్టు గుర్తించారు. అయితే, పోస్టుల తొలగింపునకు చేసిన రిక్వెస్ట్‌లో ‘FBI’ అని ఎందుకు రాశారో తమకు తెలియదని ‘ఎక్స్’ పేర్కొంది. కాగా, ‘ఎక్స్’ సంస్థకు కూడా ఏపీ పోలీసుల తప్పుడు సమాచారం ఇస్తూ మస్కా కొట్టిస్తున్నారా? అని సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేలుతున్నాయి.












