TG SAFE Raids: హైదరాబాద్‌లో పనీర్, డెయిరీ ఉత్పత్తుల తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా కొన్ని డెయిరీ యూనిట్లలో పనీర్ తయారీలో పామాయిల్, గ్లిసరాల్ మోనోస్టియరేట్ వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పలు కేంద్రాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత ప్రమాణాలు సరిగా పాటించడం లేదని వెల్లడైంది. కొన్ని యూనిట్లలో బొద్దింకలు, ఈగలు సంచరిస్తుండటాన్ని అధికారులు గుర్తించారు. దీంతో డెయిరీ ఉత్పత్తుల నాణ్యత, తయారీ ప్రక్రియపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ సోదాల్లో సుమారు రూ.7.19 లక్షల విలువైన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. ఇందులో దాదాపు టన్ను పామాయిల్, 476 కిలోల గ్లిసరాల్ మోనోస్టియరేట్, 150 కిలోల స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అలాగే మేవీస్ క్లాసిక్ ప్రీమియం కుకింగ్ క్రీమ్‌కు చెందిన 1,760 ప్యాకెట్లను కూడా జప్తు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదే సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన మూడు డెయిరీ యూనిట్ల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. మరోవైపు గగన్‌పహాడ్‌లోని ఓ డెయిరీ కేంద్రం కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. డెయిరీ ఉత్పత్తుల తయారీలో నాణ్యతా ప్రమాణాలు, పరిశుభ్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా అధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
అదేవిధంగా పలు డెయిరీ యూనిట్లలో పాల సేకరణకు సంబంధించిన సరైన రికార్డులు కూడా అందుబాటులో లేవని అధికారులు వెల్లడించారు. కల్తీపై అనుమానంతో మొత్తం 21 ఆహార నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించినట్లు చెప్పారు. నగరంలోని ఇతర డెయిరీ యూనిట్లపైనా తనిఖీలు కొనసాగుతాయని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. తాజా తనిఖీల్లో మొత్తం 12 ప్రత్యేక బృందాలు పాల్గొని నగరంలోని 14 డెయిరీ యూనిట్లలో సోదాలు చేపట్టాయని అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు సిబ్బందితో పాటు హెచ్-ఫాస్ట్ అధికారులు పాల్గొన్నట్లు చెప్పారు.












