తెలంగాణ

Jupally Krishna Rao: రహదారుల అభివృద్ధికి రూ.600 కోట్లు.. రూ.200కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్.. కొల్లాపూర్‌ సమగ్ర అభివృద్ధే లక్ష్యం

రచన: NK10 నిమిషాల పఠనం

కొల్లాపూర్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మౌలిక వసతులతో పాటు రైతులు, మహిళలు, పేదలు, విద్యార్థులు, కార్మికుల సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

* రహదారుల అభివృద్ధికి రూ.600 కోట్లు

* జెటప్రోలులో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్

* మహిళా సంఘాలకు రూ.175 కోట్ల వడ్డీ లేని రుణాలు

* మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం పెద్దపీట

* కొల్లాపూర్‌ పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

* ఆడంబరాలకు పోయి అప్పులపాలు కావొద్దు: జూపల్లి

Jupally Krishna Rao: కొల్లాపూర్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మౌలిక వసతులతో పాటు రైతులు, మహిళలు, పేదలు, విద్యార్థులు, కార్మికుల సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్‌ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ సీతక్క, ఎంపీ మల్లు రవి, జిల్లా కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌తో కలిసి శంకుస్థాపనలు చేశారు. అనంతరం కొల్లాపూర్‌ పట్టణంలోని రాజా వారి బంగ్లా ఆవరణలో నిర్వహించిన ‘1000 రోజుల ప్రజా ప్రభుత్వం’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

రహదారులకు రూ.600 కోట్లు

కొల్లాపూర్‌ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు జూపల్లి తెలిపారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ పరిధిలో రహదారుల అభివృద్ధికి ఇప్పటికే సుమారు రూ.500 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. మరో రూ.100 కోట్లతో రహదారుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. విద్యుత్‌ సరఫరాను మెరుగుపరిచేందుకు సుమారు రూ.50 కోట్లతో వివిధ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి అన్నారు. సుమారు 2,500 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా జెట్‌పోల్‌లో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భవన నిర్మాణానికి సుమారు రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న మౌలిక వసతులను తల్లిదండ్రులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పిల్లల చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.

మహిళల స్వావలంబనకు పెద్దపీట

మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి సొంత కాళ్లపై నిలబడేలా ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని జూపల్లి తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు సోలార్‌ యూనిట్లు, ఆర్టీసీ బస్సుల వంటి కార్యక్రమాల ద్వారా ఆదాయ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు రూ.175 కోట్ల వడ్డీలేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. మండలాల పరిధిలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో గొర్రె పిల్లలు, నాటుకోడి పిల్లలను పంపిణీ చేశారు.

పర్యాటక, క్రీడా రంగాల అభివృద్ధి

కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని పర్యాటక అవకాశాలను వినియోగించుకునేలా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఎంఆర్‌ఓ కార్యాలయ భవనాలతో పాటు మండలాల వారీగా సాంస్కృతిక భవనాలు, స్పోర్ట్స్‌ స్టేడియాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మౌలిక వసతులను బలోపేతం చేస్తామని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్లకు రూ.5లక్షల వరకు సాయం

అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కో ఇంటికి రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు జూపల్లి తెలిపారు. ప్రభుత్వం అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకుని అప్పుల భారం లేకుండా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని సూచించారు.

ఆడంబరాలకు పోయి అప్పులపాలు కావొద్దు

ప్రజలు తమ ఆదాయానికి అనుగుణంగా ఖర్చులు చేసుకుంటూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని మంత్రి సూచించారు. విద్య, వైద్యం, శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాల పేరుతో అవసరానికి మించి ఖర్చు చేయడం వల్ల కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయని అన్నారు. ఆరోగ్యంపై ముందస్తు శ్రద్ధ వహించాలని సూచించారు. వ్యాయామం, యోగా, ధ్యానం, ఈత వంటి కార్యకలాపాలకు ప్రతిరోజూ కొంత సమయం కేటాయించాలని కోరారు.

యువత డిజిటల్‌ వేదికలను సద్వినియోగం చేసుకోవాలి

సెల్‌ఫోన్‌, సోషల్‌ మీడియాను కేవలం వినోదానికే పరిమితం చేయకుండా విద్య, విజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. యువతతో పాటు మహిళలు కూడా డిజిటల్‌ వేదికల ద్వారా కొత్త నైపుణ్యాలను నేర్చుకుని ఉపాధి, వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు.

డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాలు

మాదకద్రవ్యాల నిర్మూలనతో పాటు వివిధ సామాజిక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవన విధానం వైపు నడిపించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి ‘ప్రభాతభేరి’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను గౌరవిస్తూ సోనియా గాంధీ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని జూపల్లి గుర్తుచేశారు. ప్రజల ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వానికి మరోసారి అవకాశం లభించిందని, సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. కొల్లాపూర్‌లో రహదారులు, విద్యుత్‌, విద్య, పర్యాటకం, క్రీడలు, గృహ నిర్మాణం, మహిళా సాధికారత తదితర రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

అంతకుముందు తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘ఆడంబరాలకు పోయి అప్పులపాలు కావద్దు’ అనే అంశంపై ప్రదర్శించిన నాటిక ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది.

#Kollapur#Jupally Krishna Rao#Kollapur Development#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి