తెలంగాణ

Eatala Rajender: రేవంత్ సర్కార్ గద్దె దిగేవరకు విశ్రమించేది లేదు- ఈటల శపథం

రచన: NK12 నిమిషాల పఠనం

Eatala Rajender: 22ఏ భూ బాధితులకు అండగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు చేపట్టిన దీక్ష కార్యక్రమానికి హాజరయ్యారు మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రేవంత్ సర్కార్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ సర్కార్ ను గద్దె దించే వరకు విశ్రమించేది లేదని శపథం చేశారు.

* ప్రజల ఉసురు పోసుకుంటున్న రేవంత్ సర్కార్ గద్దె దిగేవరకు విశ్రమించేది లేదని శపథం చేస్తున్నాం

* రేవంత్ రెడ్డి నీకు కేసీఆర్ కంటే దుర్మార్గమైన గతి పడుతుంది

* రాహుల్, సోనియా గాంధీలకు రేవంత్ రెడ్డి నెలకు 400 కోట్లు పంపిస్తున్నారు

* హిట్లర్ లాంటి క్రూరమైన పాలన రేవంత్ రెడ్డి పాలన

* ఆ ప్రభుత్వం వందల కేసులు పెట్టింది.. ఇంకా వెయ్యి కేసులు పెట్టినా రేవంత్ రెడ్డి నీ భరతం పట్టడం ఖాయం

* రంగనాథ్ నీ మీద నాకు వ్యక్తిగతంగా ఏ కోపం లేదు. పేదల జోలికి వస్తే మాత్రం వదిలేదు లేదు

* ఐఏఎస్ ఐపీఎస్ లు యస్ బాస్ అని పనిచేస్తే జైళ్లకు పోవడం ఖాయం

* ప్రజల జీతాలతో పని చేసే మమ్ముల్ని అడ్డుకుంటే పోలీసుల మీదా కేసులు పెడతాం

* అమ్ముడు దుకాణం ఇప్పుడు కూడా నడుస్తుంది. రాత్రికి రాత్రి భూ భారతిలో మార్పులు చేస్తున్నారు. పుప్పాలగూడలో 134 ఎకరాల, 17 వేల కోట్ల భూమినీ మార్చేశారు. ఆ భూములు కొనుక్కున్న వారిని కూడా వదిలిపెట్టేది లేదు.

* దుర్మార్గపు బీఆర్ఎస్ మళ్ళీ రాదు

* కాంగ్రెస్ ని పాతాళంకి తొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

* రాబోయేది బీజేపీనే

* రక్తం చిందించైనా ఈ ప్రభుత్వ దుర్మార్గాలను అడ్డుకుంటాం

Eatala Rajender: 22ఏ భూ బాధితులకు అండగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు చేపట్టిన దీక్ష కార్యక్రమానికి హాజరయ్యారు మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రేవంత్ సర్కార్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ సర్కార్ ను గద్దె దించే వరకు విశ్రమించేది లేదని శపథం చేశారు.

''మిస్టర్ రేవంత్ రెడ్డి, మిస్టర్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మా భూములు 22ఏలో పెట్టే అధికారం మీకు ఎవరిచ్చారు?'' అని ఈటల ప్రశ్నించారు. ఈరోజు కుత్బుల్లాపూర్ గిరినగర్ లో పేదల ఇళ్లను కూలుస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ను గద్దె దించేవరకు విశ్రమించేది లేదని శపథం చేశారు. 22 ఏ వల్ల ఎక్కువ వేదన అనుభవిస్తుంది మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలే అని ఈటల వాపోయారు. 22 ఏ బాధితులు స్వచ్ఛందంగా బస్సులు కట్టుకొని మరీ వచ్చారని తెలిపారు.

శ్రీలక్ష్మి, ఆచార్యలకు పట్టిన గతి పడుతుంది?

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. "యస్ బాస్" అని పని చేస్తే జైళ్ళ పాలవుతారని హెచ్చరించారు ఈటల రాజేందర్. వారి ఆదేశాలతో ప్రజల కళ్ళల్లో మట్టికొట్టిన వారిని వదిలిపెట్టేది లేదన్నారు. శ్రీలక్ష్మి, ఆచార్యలకు పట్టిన గతి మీకు పట్టకుండా చూసుకోండి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చామని మర్చిపోకండి అని అన్నారు.

నాడు హిట్లర్.. నేడు రేవంత్

''మూసీ పక్కన ఇళ్లను కూలుస్తామంటూ ఫణిగిరి కాలనీకి దానకిషోర్ అనే సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి వందలమంది అధికారులను, పోలీసులను, బుల్డోజర్లను తీసుకొని వచ్చాడు. 5 నుండి 10 కోట్ల విలువైన అపార్ట్ మెంట్లను కూలుస్తా అంటే ఎవడబ్బ జాగీరు అని రెండు రోజుల పాటు ఎర్రటి ఎండలో కూర్చొని కాపాడుకోగలిగాము. రేవంత్ రెడ్డి నీకు కేసీఆర్ కంటే దుర్మార్గమైన గతి పడుతుంది. లక్షల మందిని చంపిన నియంత హిట్లర్ ను క్రూరుడు అని ప్రపంచం గుర్తు పెట్టుకుంటే, అలాంటి దుర్మార్గ పాలన అందించింది రేవంత్ అని చరిత్రలో గుర్తు పెట్టుకుంటారు.

పొంగులేటి 22ఏ నిషేధిత జాబితాలో మా అధికారులు పెట్టొచ్చు అని మాట్లాడుతున్నారు. ఈ జీవో ఇచ్చింది మీరు కాదా? CCLA 22 ఏ గురించి 11.09.2025 న కలెక్టర్లకు లేఖ రాసింది. మేడ్చల్ కలెక్టర్ 22.11.2025 న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కి లేఖ రాస్తే.. 02.12.2025 న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వాళ్ళు సర్క్యులర్ ఇచ్చారు. ఇది మీ అందరికీ పంపిస్తా. నంగనాచి మాటలు మాట్లాడుతున్న మంత్రులారా ఖబర్దార్. అనాలోచితం కాదు బ్లాక్ మెయిలింగ్ వెపన్ గా వాడుకునేందుకు తెచ్చిన జీవో ఇది.

రాహుల్, సోనియాకు నెలకు రూ.400 కోట్లు!

రాహుల్, సోనియాలకు నెలకు 400 కోట్లు పంపించేందుకు చేసిన దుర్మార్గపు కుట్ర ఈ ఆలోచన. కొన్ని దరఖాస్తులు మాత్రమే వచ్చాయని మంత్రి పొంగులేటి చెబుతున్నారు. ఒక్క నర్సాపూర్ లో 55 వేల మంది రైతుల భూములను ఈ జాబితాలో పెట్టారంటే ఎంత గంభీరమైన సమస్యనో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ కుట్రతో తెచ్చిన ధరణితో.. కాస్తు కాలం, కబ్జాకాలం ఎగిరిపోయింది. పేదల భూములు ప్రభుత్వ భూములయ్యాయి. ఐదు, ఆరు తరాల నుండి వ్యవసాయ చేసుకుంటున్న లక్షల ఎకరాల భూముల అడ్రస్ గల్లంతైంది.

సిగరెట్ ముక్కల మీద లక్షల ఎకరాల భూములు దొరలు పేదలకు రాసిచ్చారు. ఆ భూములకు రిజిస్ట్రేషన్ లేదు. కాస్తు కాలంలో పేరు ఉండేది. కేసీఆర్ ఆ హక్కు లేకుండా చేశారు. రేవంత్ ఇంకో అడుగు ముందుకు వేసి మాదిగల భూములు లాక్కుంటున్నారు. మమ్ముల్ని ఈ భూమిలో బొంద పెట్టండి తప్ప మేము ఇక్కడనుండి పోయేది లేదని వారంటున్నారు. బహదూర్ గూడ 659 ఎకరాలలో క్వాలిటీ గులాబీలు పండిస్తారు. ఆ భూములు లాక్కుంటా అని పోతే మహిళలు కారంపొడి పట్టుకొని ఎదురుతిరిగారు. ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న మహేంద్రహిల్స్ ను కూడా ఈ జాబితాలో చేర్చిన నీచమైన ప్రభుత్వం ఇది.

రంగనాథ్.. నిన్ను వదిలేది లేదు

మిస్టర్ రంగనాథ్.. నేను నీమీద పడలేదు.. నువ్వు మా పేదల మీద పడ్డావు. మా పేదల ఇల్లు కూలుస్తున్నావు. బీజేపీ పోరాటం చేసి అనేకమంది పేదలకు ఇల్లు కట్టించింది. వాజపేయి నగర్, దత్తాత్రేయ నగర్, భగత్ సింగ్ నగర్ లాంటి అనేక బస్తీలకు జన్మనిచ్చిన పార్టీ బీజేపీ. ఆ ప్రభుత్వం వందల కేసులు పెట్టింది.. ఇంకా వెయ్యి కేసులు పెట్టినా రేవంత్ రెడ్డి నీ భరతం పట్టడం ఖాయం. రంగనాథ్ నీ మీద నాకు వ్యక్తిగతంగా ఏ కోపం లేదు. పేదల జోలికి వస్తే మాత్రం వదిలేదు లేదు.

గాజుల రామారంలో 200 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ వడ్డెరలు 4 ఎకరాలలో గుడిసెలు వేసుకుని 80 ఏళ్ళ నుండి ఉంటున్నారు. రాళ్ళు కొట్టుకొని బతికిన వాళ్ళు. అక్కడి నుండి వాళ్ళు వెళ్ళిపోవాలని హైడ్రా వచ్చి వేసుకున్న బోర్లు పీకేశారు, కరెంట్ తీసేశారు. ఆ శిథిలాల మీద బిక్కుబిక్కుమంటూ పిల్లలు కూర్చుని అమ్మ అన్నం పెట్టు అని అడుగుతుంటే పెట్టలేక బాధపడిన ఆ అమ్మల శాపం నీకు తగలక మానదు. పైగా మరుసటి రోజు 10వేల కోట్ల భూమిని కాపాడా అని రంగనాథ్ స్టేట్ మెంట్ ఇచ్చారు.

అస్మత్ పేటలో.. బోయినపల్లి మార్కెట్ లో పని చేసేవారు 60 గజాలు కొనుక్కున్నారు. అమ్మిన వారికి అనుమతి ఇచ్చిన అధికారులను అరెస్ట్ చేసే దమ్ములేదు కానీ అక్కడికి ఎంపీ పోతా అంటే పోనివ్వలేదు. ప్రజల జీతాలతో పని చేసే మమ్ముల్ని అడ్డుకుంటే పోలీసుల మీద కూడా కేసులు పెడతాం. 22 ఏను కాదు మా భూములను నిషేధిత జాబితా నుండి తీసివేయాలని డిమాండ్ చేస్తున్నా.

నా పార్లమెంట్ పరిధిలో కూకట పల్లి గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కు చెందిన 20 వేల కోట్ల భూములు, IDPL కి చెందిన 12 వేల కోట్ల భూములు (ఫీనిక్స్) కేసీఆర్ అప్పగిస్తే, రేవంత్ కొనసాగిస్తున్నారు. ముక్క అమ్మితే విద్యార్ధులకు డబ్బులు ఇస్తా అన్న రేవంత్ ఎందుకు ఆ భూములు వెనక్కు తీసుకోవడం లేదు. మహాత్మాగాంధీ నగర్ పక్కన 176 ఎకరాల కాలనీ కేసీఆర్ బ్రోకర్స్ కి కట్టబెట్టారు. అమ్ముడు దుకాణం ఇప్పుడు కూడా నడుస్తుంది. రాత్రికి రాత్రి భూభారతిలో మార్పులు చేస్తున్నారు. పుప్పాలగూడలో 134 ఎకరాల, 17వేల కోట్ల భూమినీ మార్చేశారు. ఆ భూములు కొనుక్కున్న వారిని కూడా వదిలిపెట్టేది లేదు.

దుర్మార్గపు బీఆర్ఎస్ మళ్ళీ రాదు. కాంగ్రెస్ ను పాతాళంకి తొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ధర్మ పాలన కోసం, తెలంగాణ అప్పులు పోవడం కోసం బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రక్తం చిందించైనా ఈ ప్రభుత్వ దుర్మార్గాలను అడ్డుకుంటాం. బాధితులారా ఈడీ సీబీఐ సంస్థలకు ఫిర్యాదు చేసైనా మీ ఆవేదన ఆగేలా చేస్తాము'' అని ఈటల రాజేందర్ అన్నారు.

#Eatala Rajender#Telangana Politics#22A Prohibited Lands#Cm Revanth Reddy#Congress#Brs#Bjp#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి