Cm Revanth : నకిరేకల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెలరేగిపోయారు. ఇక దండయాత్రే.. సిరిసిల్ల, సిద్ధిపేట వస్తున్నా.. కాస్కోండి.. అంటూ కేటీఆర్, హరీశ్ రావు టార్గెట్ గా విరుచుకుపడ్డారు. ''ఈడ ఆడ కాదు.. ఇక సిరిసిల్ల వస్తా.. సిరిసిల్ల గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగరేస్తా. సిరిసిల్ల తర్వాత సిద్ధిపేట మీద దండయాత్ర చేస్తాం'' అని రేవంత్ రెడ్డి అన్నారు. బావ బామ్మర్దుల్లారా.. బంధువులనే తెచ్చుకుంటారో, బానిసలనే తెచ్చుకుంటారో, ఎవరిని తెచ్చుకుంటారో తెచ్చుకోండి.. సిరిసిల్ల, సిద్ధిపేటలో తేల్చుకుందాం.. కాస్కోండి కల్వకుంట్ల కుటుంబమా?'' అంటూ సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి.
''ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా 365 రోజులు ఉద్యోగానికి రాకపోతే ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేస్తారు. మరి ఈ వెయ్యి రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా 22కోట్ల 24లక్షల 40వేల రూపాయల జీతభత్యాలు.. ఉండేందుకు ఇల్లు, తిరిగేందుకు బండి ఇలా అన్ని వసతులు తీసుకున్నారు. కానీ, ఒక్క రోజు కానీ ఒక్క గంట కానీ బయటకు రాలేదు. మరి డిస్మిస్ చేయాల్సిన అవసరం ఉందా? లేదా? కార్యకర్తల్లారా మీరు ఆలోచన చేయండి.
ఎవరి సొమ్ము ఇది. 22 కోట్లు పేద ప్రజల సొమ్ము. ఫామ్ హౌస్ కే పరిమితమైపోయారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడటం లేదు. మీకు భవిష్యత్తు లేదిక. మీ బతుకులు చీకటిమయమే. రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం, ఈ కార్యకర్తలు నాకు అండగా నిలబడినంత కాలం బీఆర్ఎస్ అనే మొలకను ఎత్తనివ్వము. తెలంగాణ తులసి వనంలో గంజాయి మొక్కలను పీకేస్తాం.
వచ్చేసారి సిరిసిల్ల, సిద్ధిపేటలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెక్ట్స్ కదం సిరిసిల్ల. ఈ నెలాఖరుకు సిరిసిల్లకు పోదాం. రంగం సిద్ధం చేయండి. మిత్రులారా.. రండి అందరం పోదాం.. ఈడ ఆడ కాదు.. ఈ నెలాఖరుకు వస్తా.. సిరిసిల్ల గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగరేస్తా. సిరిసిల్ల తర్వాత సిద్ధిపేట మీద దండయాత్ర చేస్తారు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. బావ బామ్మర్దుల్లారా బంధువులనే తెచ్చుకుంటారో, బానిసలనే తెచ్చుకుంటారో, చెప్పులు మోసే వాళ్లను తెచ్చుకుంటారో తెచ్చుకోండి.. సిరిసిల్ల, సిద్ధిపేటలో తేల్చుకుందాం. మా కాంగ్రెస్ సైన్యంతో ఈ నెలాఖరుకు సిరిసిల్ల వస్తా. వచ్చే నెల సిద్ధిపేట వస్తా. కాస్కోండి కల్వకుంట్ల కుటుంబామా?'' అంటూ సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి.












