తెలంగాణ

TGSAFE: లైసెన్సులు రద్దయినా డోంట్ కేర్.. దర్జాగా తెరిచి మరీ కల్తీ దందా!

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

TGSAFE: హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లోని కార్పొరేట్ అద్దాల మేడలు, జిగేల్మనే ఏసీ రెస్టారెంట్ల అసలు రంగు బయటపడినా నిర్వాహకుల్లో ఏమాత్రం చలనం కనిపించడం లేదు. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం మెరుపు దాడులు చేసి, లైసెన్సులు క్యాన్సల్ చేసినా..

TGSAFE: హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లోని కార్పొరేట్ అద్దాల మేడలు, జిగేల్మనే ఏసీ రెస్టారెంట్ల అసలు రంగు బయటపడినా నిర్వాహకుల్లో ఏమాత్రం చలనం కనిపించడం లేదు. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం మెరుపు దాడులు చేసి, లైసెన్సులు క్యాన్సల్ చేసినా.. "మాకేం కాదు.. మా బిజినెస్ ఆగదు" అన్నట్లుగా నిర్వాహకులు దర్జాగా బోర్డులు తెరిచి కల్తీ దందాను కొనసాగిస్తున్నారు. లక్షల్లో లాభాలు గడించే హోటళ్ల ఓనర్స్‌కి అధికారుల తనిఖీలు, నామమాత్రపు జరిమానాలు లెక్కే కాకుండా పోయాయి.

రద్దు చేసినా తెరిచే ఉంచారు

గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ ‘అంతేరా కిచెన్ అండ్ బార్’ లైసెన్స్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు రూల్స్ బ్రేక్ చేసిన కారణంగా క్యాన్సల్ చేశారు. అయితే అధికారులు వెళ్లిన మరుసటి రోజే ఎటువంటి బెరుకు లేకుండా ఆ రెస్టారెంట్ మళ్లీ తెరుచుకుని వ్యాపారం సాగించడమే ఓనర్ల బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తుంది.

నిబంధనలను కాలరాసినందుకు 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దవగా, మరికొన్నింటికి నోటీసులు అందాయి. కానీ చట్టాల్లోని లొసుగులు, నామమాత్రపు పెనాల్టీలను అడ్డుపెట్టుకుని అదే అపరిశుభ్ర కిచెన్లలో మళ్లీ వంటలు మొదలుపెట్టేస్తున్నారు. రోజుకు వేలల్లో పడే జరిమానాలు.. వాళ్లు గడించే లక్షల లాభాల ముందు కంటితుడుపుగానే మిగులుతున్నాయి.

ప్లేట్లలోకి నేరుగా పాయిజన్

పైకి లగ్జరీగా కనిపించే ఈ రెస్టారెంట్ల కిచెన్ల లోపల నరకం తాండవిస్తోంది. బొద్దింకలు, ఈగలు, ఎలుకల మలమూత్రాల మధ్యే వంటలు తయారవుతున్నాయి. ఫ్రీజర్లలో కుళ్లిన చికెన్, మటన్‌తో పాటే వెజ్ పదార్థాలను కుక్కేస్తున్నారు. పురుగులు పట్టిన మైదా, బూజు పట్టిన జీడిపప్పు, ఎలుకలు కొరికిన మయోనైజ్ ప్యాకెట్లతో చేసిన ఆహారాన్నే టేబుళ్లపై సర్వ్ చేస్తున్నారు. చెఫ్‌లు, వంట మనుషులు గుట్కాలు నములుతూ, సిగరెట్లు కాలుస్తూ వంటగదుల్లోనే తిరుగుతున్న దృశ్యాలు కొనుగోలుదారులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.

హైదరాబాద్‌లోని మోనాస్ట్రీ, ఆహా తెలుగు కిచెన్, లక్కీ మల్టీ కుజిన్, సాయిరామ్ మెస్ మొదలుకొని రమేశ్వరం కేఫ్, ఇష్టా వంటి చోట్ల కూడా రూల్స్ బ్రేక్ చేసిన ఘటనలు బట్టబయలయ్యాయి. అటు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ డార్క్ స్టోర్లు, విశాఖపట్నంలోని కామత్, పిస్తా హౌస్, ఆల్ఫా హోటళ్లలోనూ దాదాపు 90 కిలోల కుళ్లిన చికెన్ దొరకడం చూస్తుంటే ఈ కల్తీ దందా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏ స్థాయిలో పాతుకుపోయిందో అర్థమవుతోంది.

క్రిమినల్ కేసులు పెడితేనే బుద్ధి వస్తుంది..

కేవలం నోటీసులు జారీ చేయడం, వేల రూపాయల్లో ఫైన్లు వేసి చేతులు దులుపుకోవడం వల్ల పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. లైసెన్స్ క్యాన్సల్ చేసినా దొడ్డిదారిన వ్యాపారాలు కొనసాగిస్తున్న ఓనర్స్‌పై నాన్-బెయిలబుల్ క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కుళ్లిన, విషపూరిత ఆహారాన్ని వడ్డిస్తూ ప్రజల లివర్లు, పేగులను గుల్ల చేస్తున్న ఇలాంటి హోటళ్లను శాశ్వతంగా సీజ్ చేసి, నిర్వాహకులను కటకటాల వెనక్కి నెడితేనే అమాయకుల ప్రాణాలకు రక్షణ దక్కుతుందనే వాదన బలంగా వినిపిస్తుంది.

#TGSAFE#Telangana Food Safety#Hyderabad Food Safety#Food Safety Violations#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి