తెలంగాణ

OU: సీఎం చెప్పినా పైసా విదల్చని ఫైనాన్స్ శాఖ.. ఓయూ ఫండ్స్‌పై కొర్రీలు!

రచన: Mahesh••6 నిమిషాల పఠనం

OU: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను సైతం పక్కనపెడుతూ తెలంగాణ ఆర్థిక శాఖ వ్యవహరిస్తున్న తీరు సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని, వర్సిటీకి రూ.1000 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించి, విద్యాశాఖ ద్వారా జీవో కూడా ఇప్పించారు.

OU: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను సైతం పక్కనపెడుతూ తెలంగాణ ఆర్థిక శాఖ వ్యవహరిస్తున్న తీరు సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని, వర్సిటీకి రూ.1000 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించి, విద్యాశాఖ ద్వారా జీవో కూడా ఇప్పించారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి నయాపైసా విదల్చకుండా కొర్రీల మీద కొర్రీలు వేస్తుండటంతో ఓయూ అభివృద్ధి నిధుల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది.

పైసా రాని రూ.1000 కోట్ల జీవో!

ఓయూ ప్రాంగణాన్ని సందర్శించిన సందర్భంగా హాస్టళ్లు, అకడమిక్ భవనాలు, రీసెర్చ్ ల్యాబ్‌ల నిర్మాణం కోసం భారీ ఎత్తున నిధులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో విద్యాశాఖ ఏకంగా రూ.1000 కోట్లు కేటాయిస్తూ డిసెంబర్ 9, 2025న జీవో నంబర్ 189ని విడుదల చేసింది. ఆ తర్వాత 2026-27 బడ్జెట్‌లోనూ మరోసారి వెయ్యి కోట్ల ప్రస్తావన తెచ్చారు. అయితే ఆర్థిక శాఖ నుంచి మాత్రం ఈ వ్యవహారంపై ఏ మాత్రం సపోర్ట్ చేయడం లేదు. సీఎం ఆదేశించినా, సంబంధిత శాఖ జీవో రిలీజ్ చేసినా.. నిధుల విడుదలకు మాత్రం ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం గమనార్హం.

నిబంధనల మెలిక.. 'మా పర్మిషన్ ఎక్కడ?'

విద్యాశాఖ పంపిన ఫైళ్లపై ఆర్థిక శాఖ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఫైనాన్స్ శాఖ అనుమతి తీసుకోకుండా ఏకపక్షంగా రూ.1000 కోట్ల జీవో ఎలా రిలీజ్ చేస్తారంటూ ఫైనాన్స్ శాఖ రివర్స్ క్వశ్చన్స్ సంధిస్తోంది. కేవలం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకంతో జారీ చేసిన ఆ ఉత్తర్వులకు తాము నిధులు కేటాయించే ప్రసక్తే లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. సీఎం హామీ ఇచ్చిన ప్రాజెక్టుల విషయంలో సాధారణంగా ప్రత్యేక అనుమతులు మంజూరవుతాయి, కానీ ఓయూ విషయంలో మాత్రం ఆర్థిక శాఖ ససేమిరా అనడం చర్చనీయాంశమైంది. దీంతో గడిచిన ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన వెయ్యి కోట్లలో ఒక్క రూపాయి కూడా వర్సిటీకి చేరలేదు.

రూ.200 కోట్ల అత్యవసర ఫైల్‌‌పైనా అదే తీరు..

మొత్తం నిధులు రాకపోయినా, వర్సిటీలోని అత్యవసర పనుల కోసం 'తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్' ద్వారా తొలి విడతగా కనీసం రూ.200 కోట్లు విడుదల చేయాలని ప్రతిపాదనలు పంపారు. అయితే ఈ ఫైల్‌పైనా ఆర్థిక శాఖ తనదైన శైలిలో కొర్రీలు పెట్టింది. ఫస్ట్ విడతలో ఏ పనులకు ఖర్చు చేస్తారు? పూర్తి పనుల వివరాలు, అంచనాలు ఎక్కడ? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఫైల్‌ను పెండింగ్‌‌లో పడేసింది. కనీసం విద్యాశాఖ అధికారులు వచ్చి మాట్లాడటం లేదంటూ వింత వాదనలు తెరపైకి తెస్తోంది.

సీఎం పదేపదే ఓయూ డెవలప్‌మెంట్‌పై సమీక్షలు జరుపుతున్నా, ఆయన మాటలకు విలువనివ్వకుండా ఫైనాన్స్ శాఖ అధికారులు కొర్రీలతో ఫైళ్లను అటకెక్కించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు ప్రతిష్టాత్మక హామీలే ఉన్నతాధికారుల పెన్ను పోట్లకు బలైపోతుంటే, వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఓయూ అభివృద్ధి ఎండమావిలాగే మిగిలిపోతోందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

#Osmania University#OU Funds#CM Revanth Reddy#Telangana Finance Department#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి