Talasani Srinivas Yadav: రాష్ట్ర రాజకీయాల్లో ఉప ఎన్నిక నగారా మోగకముందే ఖైరతాబాద్ నియోజకవర్గం కేంద్రంగా పొలిటికల్ హీట్ పీక్స్‌కి చేరింది. గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలను దశాబ్దాలుగా శాసిస్తున్న సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజా అడుగులు చూస్తుంటే.. ఈ ఉపఎన్నికను ఆయన అత్యంత వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం పార్టీ గెలుపు మాత్రమే కాకుండా, తన రాజకీయ వారసుడైన కుమారుడు సాయి కిరణ్ యాదవ్ భవిష్యత్తుకు బలమైన పునాది వేసేందుకు ఈ ఎన్నికను ఒక 'లిట్మస్ టెస్ట్'గా భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది.
హైకమాండ్‌కు గెలుపు హామీ.. ఇన్‌ఛార్జ్ బాధ్యత నాకే ఇవ్వండి!
తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ అధిష్టానం వద్ద పెట్టిన ప్రతిపాదనలే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తన కుమారుడు సాయి కిరణ్ యాదవ్‌కు ఖైరతాబాద్ టికెట్ కేటాయిస్తే, నియోజకవర్గ ఉపఎన్నిక ఇన్‌ఛార్జ్ బాధ్యతలను సైతం తన భుజాలపై వేసుకుంటానని ఆయన పార్టీ పెద్దలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. గతంలో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన సాయి కిరణ్‌కు ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కల్పించాలని తలసాని గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది. గ్రేటర్ పరిధిలో తనకున్న కేడర్, బీసీ సామాజిక వర్గ బలం, పార్టీ యంత్రాంగాన్ని ఏకతాటిపైకి తెచ్చి ఖైరతాబాద్‌పై గులాబీ జెండా ఎగరేసే బాధ్యత పూర్తిగా తానే తీసుకుంటానని హైకమాండ్‌కు భరోసా ఇస్తున్నారని గులాబీ దళంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మైకుల ముందు కాదు.. గెలిచాకే తడాఖా చూపిస్తా
ఇటీవల వినాయక చవితి నిమజ్జనం రోజున తలసాని చేసిన కామెంట్స్ ఈ ప్రెస్టేజ్ ఫైట్‌ను మరింత బయటపెట్టాయి. "ఖైరతాబాద్‌కు త్వరలోనే కొత్త ఎమ్మెల్యే రాబోతున్నారు" అని కుండబద్దలు కొట్టిన ఆయన, "నేను ఇతరుల్లా ఊరికే మైకుల ముందు ఛాలెంజ్ చేసే వ్యక్తిని కాదు.. గెలిచిన తర్వాతే మాట్లాడతా. మా అసలు పవర్ ఏంటో ఎన్నికల బరిలోనే చూపిస్తాం" అంటూ నేరుగా ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. ఈ స్థాయిలో ఆయన దూకుడు ప్రదర్శించడం వెనుక కేవలం రాజకీయ వ్యూహమే కాకుండా, తన పట్టును నిరూపించుకోవాలనే పంతం కూడా స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఒకప్పటి మిత్రుడు దానంతో టఫ్ ఫైట్
ఈ పోరు వ్యక్తిగత ప్రతిష్టగా మారడానికి మరో కీలక కారణం ప్రత్యర్థి శిబిరంలో దానం నాగేందర్ ఉండటమే. నగర రాజకీయాల్లో తలసాని, దానం దశాబ్దాల కాలంగా సన్నిహిత మిత్రులుగా మెలిగారు. ఇప్పుడు రాజకీయ సమీకరణాలు మారి దానం కాంగ్రెస్ గూటికి చేరడం, ఈ ఉప ఎన్నికల్లో ఆయనే అధికార పార్టీ నుంచి బరిలోకి దిగే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో ఈ ఫైట్ అత్యంత రసవత్తరంగా మారింది. ఒకప్పుడు తోడుగా నిలిచిన మిత్రుడి ఇలాకాలోనే తన కుమారుడిని నిలబెట్టి ఓడించడం ద్వారా, గ్రేటర్ రాజకీయాల్లో తన మాస్ లీడర్‌షిప్‌కు తిరుగులేదని నిరూపించుకోవాలన్నది తలసాని అంతర్గత వ్యూహంగా కనిపిస్తోంది.
వారసుడి రాజకీయ భవిష్యత్తుకు ఇదే కీలకం
సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత సాయి కిరణ్ యాదవ్ రాజకీయ భవిష్యత్తు కోసం తలసాని సేఫ్, బలమైన ప్లేస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఖైరతాబాద్ ఒకప్పుడు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడం, అక్కడ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉండటంతో కొడుకును ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపేందుకు ఇదే సరైన అవకాశంగా తలసాని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే ప్రత్యర్థుల ఎత్తులు, అధికార కాంగ్రెస్ బలగాలు, అటు బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురౌతున్న.. వాటన్నింటినీ దాటుకుని గులాబీ జెండా ఎగరేయడమే ఏకైక లక్ష్యంగా తలసాని గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారని తెలుస్తుంది.
మొత్తానికి, ఖైరతాబాద్ ఉపఎన్నిక రిజల్ట్ కేవలం ఒక సీటు గెలుపు ఓటములకే పరిమితం కాకుండా.. తలసాని కుటుంబ రాజకీయ భవితవ్యాన్ని, గ్రేటర్‌లో ఆయన పొలిటికల్ ఇమేజ్‌ను నిర్ణయించే స్థాయికి చేరిందని పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అందుకే ఈ పోరును తలసాని తన 'పర్సనల్ ప్రెస్టేజ్'గా మార్చుకుని చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. చూడాలి మరి తలసాని పతం గెలుస్తుందా లేదా అనేది.


