Singeetham Srinivasa Rao: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయోగాల మాంత్రీకుడు, కొత్త కథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అక్టోబర్ 3న కన్నుమూశారు. 94 ఏళ్ల వయసులో ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ శనివారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సింగీతం మృతి సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
సింగీతం శ్రీనివాసరావు అంటేనే ప్రయోగాత్మక చిత్రాలకు మరో పేరుగా అటు తమిళ ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ ప్రఖులు విశ్లేషిస్తారు..విశ్వసిస్తారు. కథను ఎప్పుడూ మూస పద్ధతిలో చెప్పకుండా.. ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని అందించాలనే తపనతో సినిమాలు చేసిన దర్శకుడిగా సింగీంకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఆయన ఎన్నో ప్రయోగాలు చేసి తనదైన ముద్ర వేశారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన సింగీతం సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
‘పుష్పక విమానం’: మూకీ సినిమాతో మాయ చేసిన సింగీతం..
కమల్ హాసన్ హీరోగా రూపొందిన ‘పుష్పక విమానం’ సింగీతం శ్రీనివాసరావు కెరీర్‌లోనే కాదు.. భారతీయ సినిమా చరిత్రలోనూ ప్రత్యేకమైన ప్రయోగం. దాదాపు ఈ సినిమాలో మాటలు లేకుండా కేవలం హావభావాలు, సంగీతం, విజువల్స్‌తో కథను నడిపించిన ఈ చిత్రం ఆ తర్వాత ఎందరికో స్పూర్తిగా నిలిచింది.
‘భైరవ ద్వీపం’ నుంచి ‘మయూరి’ వరకు..
జానపదం, సోషియో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, కామెడీ, ఎమోషన్.. ఇలా ఒక్కో జానర్‌ను ఒక్కో విధంగా టచ్ చేసిన దర్శకుడు సింగీతం. ‘భైరవ ద్వీపం’, ‘మయూరి’, ‘విచిత్ర సోదరులు’, ‘మైఖేల్ మదన కామరాజన్’ వంటి సినిమాలు ఆయనలోని వైవిధ్యమైన దర్శకుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాయి.
‘ఆదిత్య 369’తో టైమ్ ట్రావెల్‌కు కొత్త అర్థం చెప్పిన సింగీతం:
సింగీతం పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చే సినిమాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. అప్పట్లోనే నందమూరి బాలకృష్ణతో చేసిన ఈ సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను తెలుగు తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. విజ్ఞానం, చరిత్ర, వినోదం కలగలిపి సింగీతం తెరకెక్కించిన తీరు ఆయన ఆలోచనా విధానానికి నిదర్శనంగా నిలిచింది. ఒకరకంగా, అప్పట్లో వచ్చిన పాన్ ఇండియా సినిమా కంటే అతిపెద్ద ప్రోగంగా చెప్పుకోవాలి.

ప్రభాస్ ‘కల్కి’ కి క్రియేటర్‌గా:
ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఆయన కూతుర్లు నిర్మించిన పాన్ ఇండియన్ సినిమా కల్కి చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పడుకొనె లాంటి అగ్ర సినీ తారలు నటించారు. ఇటీవలే, ఆయన దర్శకత్వంలో కొత్త చిత్రం కూడా ప్రారంభం అయింది. ఇక, బాలయ్యతోనే ఆదిత్య 369 సీక్వెల్ మూవీ చేయాలనుకున్నారు. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. నందమూరి మోక్షజ్ఞను ఇండస్ట్రీ ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 పేరుతో పరిచయం చేస్తారనే ప్రచారమూ జరిగింది. ఏదేమైనా సింగీతం ఆయన సరికొత్త ఆలోచనలతో రూపొందించిన చిత్రాలు నేటి దర్శకులకి మార్గదర్శకాలుగా మిగిలిపోతాయి.
కాగా, సింగీతం అకాల మృతి పట్ల సినీ పరిశ్రమలోని ప్రముఖులంతా ఆయనకి సంతాపం తెలియజేస్తున్నారు. ఇక, ఆయనతో చిత్ర పరిశ్రమకీ, సినీ ప్రముఖులకీ విడదీయరాని అనుబంధం ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


