తెలంగాణలోని వయోవృద్ధులకు (సీనియర్ సిటిజన్లు) రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వయోవృద్ధులకు కూడా విస్తరించే అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిశీలిస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. వీలైనంత త్వరగా ఈ ప్రతిపాదనను కార్యరూపంలోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
ఈ పథకం అందుబాటులోకి వస్తే మహిళలతో పాటు వృద్ధులైన పురుషులందరికీ ప్రయోజనం చేకూరనుంది. వయోవృద్ధులు తమ వైద్య అవసరాల నిమిత్తం ఆసుపత్రులకు, పుణ్యక్షేత్ర దర్శనాలకు, బంధువుల ఇళ్లకు ఎవరిపైనా ఆధారపడకుండా ఉచితంగా ప్రయాణించేందుకు ఈ సదుపాయం ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 32.69లక్షలుగా ఉన్న వృద్ధుల సంఖ్య, ప్రస్తుతం సుమారు 48 లక్షలకు (మొత్తం జనాభాలో 12.5 శాతం) పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
అయితే, ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సంబంధించి వయోపరిమితి, అర్హతలు, ఆదాయ నిబంధనల ఖరారుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. విధివిధానాల రూపకల్పన అనంతరం సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ఇప్పటికే ఉచిత మహిళా ప్రయాణంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) పై పడుతున్న ఆర్థిక భారాన్ని గమనిస్తున్న ప్రభుత్వం, సీనియర్ సిటిజన్లకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా పడే అదనపు ఆర్థిక భారం, దాని నిధుల సమీకరణపై రవాణా, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తోంది.
రాష్ట్రంలో ఇప్పటికే వయోవృద్ధుల సంక్షేమం కోసం 'చేయూత' పెన్షన్ పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి సేవలను ప్రభుత్వం అందిస్తోంది. బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వస్తే వయోవృద్ధులకు మరింత ఊరట లభిస్తుందని సంక్షేమ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అన్ని రకాల నిబంధనలు, విధివిధానాలు ఖరారైన తర్వాతే ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా అమలు చేయనున్నారు.


